24 గంటల్లో 27.37 టీఎంసీలు

26 Jul, 2021 02:00 IST|Sakshi

శ్రీశైలంలోకి 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

తుంగభద్ర డ్యామ్‌ గేట్లు ఎత్తివేత

నేడు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌/ భద్రాచలం/ కాళేశ్వరం: కృష్ణా నది పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ నుంచి దిగువకు పరుగులు పెడుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 24 గంటల్లో 27.37 టీఎంసీలు చేరాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 93.58 టీఎంసీలు ఉన్న నీటి నిల్వ .. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 120.95 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టులోకి ఏ స్థాయిలో వరద ఉధృతి ఉందో ఇది స్పష్టం చేస్తోంది. తుంగభద్ర పోటెత్తడంతో డ్యామ్‌లోకి 1.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 88.66 టీఎంసీలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి దిగువకు 40 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆదివారం అర్ధరాత్రికి దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని తుంగభద్ర బోర్డు వర్గాలు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చే వరద మరింతగా పెరగనుంది. ప్రస్తుతం 4,05,064 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 95 టీఎంసీలు అవసరం. వరద ఉధృతి ఇలానే కొనసాగితే గురువారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 

సాగర్‌కు 31,784 క్యూసెక్కులు 
శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న నీటితో కలిపి సాగర్‌కు 31,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ నుం చి పులిచింతల ప్రాజెక్టులోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తోంది.   

ప్రమాద హెచ్చరికల ఉపసంహరణ 
గోదావరి నది శాంతించింది. భద్రాచలం వద్ద వరద తగ్గింది. ఆదివారం తెల్లవారుజామున నీటిమట్టం 48 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను, సాయంత్రం 4 గంటలకు 43 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం అధికారులు ఉపసంహరించారు. కాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం పుష్కర ఘాట్‌ వద్ద శుక్రవారం 13.70 మీటర్లు ఉన్న నీటిమట్టం ఆదివారం నాటికి 9.50 మీటర్లకు చేరింది.

మరిన్ని వార్తలు