నీటి వృథాకు సెన్సర్‌తో చెక్‌

6 Apr, 2022 08:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా, గోదావరి జలాలు వృథా కాకుండా జలమండలి సెన్సర్‌ సాంకేతికతతో చెక్‌ పెట్టనుంది. మహానగరం పరిధిలో జలమండలికున్న సుమారు 400 సర్వీసు రిజర్వాయర్లు.. ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌–2 పథకం కింద నూతనంగా ఏర్పాటు చేయనున్న మరో వందకు పైగా రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు. ఆయా రిజర్వాయర్ల వద్ద ప్రతి నిత్యం ఏరులై పారుతున్న శుద్ధి చేసిన నీటిని వృథాను కట్టడి చేయనున్నారు. తద్వారా నగరంలో రోజువారీగా 45 శాతం లెక్కలోకి రాని నీటి మొత్తంలో కనీసం పదిశాతం నీటినైనా ఒడిసిపట్టనున్నారు.  

అలారం మోతతో అప్రమత్తం 
ఫిల్టర్‌బెడ్ల నుంచి రిజర్వాయర్లకు  శుద్ధి చేసిన జలాలను పంపింగ్‌ చేయడం ద్వారా నింపుతున్న విషయం విదితమే. ఇదే సమయంలో ఆయా రిజర్వాయర్ల లోపల సెన్సర్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్టోరేజి రిజర్వాయర్‌ నిండుతున్న క్రమంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక అడుగు ఉన్న సమయానికే ఈ సెన్సర్‌ గ్రహించి అలారానికి సంకేతాలు పంపుతుంది.  

అలారం పెద్ద శబ్దంతో మోగుతుంది. వెంటనే అక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తమై వెంటనే రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించే వాల్వును ఆపేస్తారు. ఒకవేళ అలారం మోగినపుడు సిబ్బంది అందుబాటులో లేనప్పటికీ.. ఐవీఆర్‌ఎస్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌) ద్వారా సంబంధిత మేనేజర్‌తోపాటు రిజర్వాయర్‌ ఇన్‌చార్జికి సైతం ఫోన్‌కాల్‌ వెళ్తుంది. రిజర్వాయర్‌ నిండింది అంటూ వాయిస్‌కాల్‌ వెళ్తుంది.  

వెంటనే వారు అప్రమత్తమై వాల్వును ఆపేసే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతను పర్యవేక్షించేందుకు ప్రతి 5– 6 రిజర్వాయర్లకు ఒక ఇన్‌చార్జిని జలమండలి నియమించనుంది. అన్ని రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు తెలిపారు. 

పొంగిపొర్లడం నిత్యకృత్యమే.. 
నగరంలో జలమండలి స్టోరేజి రిజర్వాయర్లున్న ప్రతీ వీధి, కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు పొంగిపొర్లడం స్థానికులకు నిత్యకృత్యమే. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రతి రిజర్వాయర్‌ ఓవర్‌ ఫ్లో అయ్యే వరకు వాల్వ్‌ను నిలిపివేయరు. దీంతో విలువైన తాగునీరు రహదారులు, కాలనీలను ముంచెత్తుతోంది. ఈ పరిస్థితికి సెన్సర్‌ సాంకేతికతతో చెక్‌ పెట్టనున్నట్లు జలమండలి తెలిపింది.  

నీటి వృథాను అరికట్టండి 
నగరానికి జలమండలి సరఫరా చేస్తున్న నీటి వాటాలో ఎలాంటి కోతలు లేవు. వేసవి కారణంగా వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో వాహనాలు, ఫ్లోర్‌ క్లీనింగ్, గార్డెనింగ్‌ అవసరాలకు నల్లా నీటిని వినియోగించవద్దు. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వాడుకోవాలి. నీటి పొదుపుపై అన్ని వర్గాలు అవగాహన పెంపొందించుకోవాలి.    
 – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ 

(చదవండి: ఆ చిరునవ్వులిక కానరావు)


 

మరిన్ని వార్తలు