KTR: ‘ముందస్తు’పై మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

29 Jan, 2023 05:47 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచన

కేంద్రం మాటలు, చేతలకు పొంతనలేదని ధ్వజం

లాభాలొస్తున్న సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని మండిపాటు 

ఢిల్లీ బీజేపీ అవార్డులిస్తుంటే గల్లీ బీజేపీ విమర్శిస్తోందని వ్యాఖ్య

నిజామాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధపడితే తెలంగాణలోనూ శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. శనివారం నిజామాబాద్‌ పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్‌–సబ్‌కా వికాస్‌’ అని మాటలు చెబుతూ చేతల్లో మాత్రం ‘సబ్‌కా బక్వాస్‌’ చేస్తోందని దుయ్యబట్టారు. నష్టాలు వస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను జాతీయం చేస్తూ లాభాలు వస్తున్న సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని ఆయన మండిపడ్డారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి చివరకు జౌళి బోర్డును సైతం ఎత్తేసిందని విమర్శించారు.

మోదీకి చివరి అవకాశం...
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమ, పారిశ్రామిక రాయితీలు ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వానికి చివరి అవకాశమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి నిధులు రాబట్టాలని కేటీఆర్‌ సూచించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.3.68 లక్షల కోట్ల ఆదాయం ఇస్తే తిరిగిచ్చింది రూ.1.68 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. ప్రతి రూపాయికి తిరిగి ఇస్తోంది 46 పైసలు మాత్రమేనన్నారు. ఇది అబద్ధమైతే తాను రాజీనామా చేస్తానన్నారు.

ఎంపీ అర్వింద్‌.. సభ్యతతో మాట్లాడు..
రాష్ట్ర బీజేపీ నేతలు మంత్రులను తిట్టడం నిత్యం పనిగా పెట్టుకున్నారని... వారికన్నా తాము ఎక్కువగా మాట్లాడగలమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ముఖ్యంగా ఎంపీ అర్వింద్‌ ఇకనైనా సభ్యతతో మాట్లాడాలని హితవు పలికారు. ‘డి.శ్రీనివాస్‌ అంటే మా అందరికీ గౌరవం ఉంది. పెద్దాయన కొడుకువని ఊరుకుంటున్నాం. ఇకపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం’ అని కేటీఆర్‌ హెచ్చరించారు. పల్లెప్రగతి, స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో దేశంలో టాప్‌–20లో 19 గ్రామాలను తెలంగాణ నుంచి ఎంపిక చేసి కేంద్రం అవార్డులు ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. కానీ గల్లీలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. కాగా, మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులు విడివిడిగా అడ్డగించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఐదు విప్లవాలు సృష్టించాం: కేటీఆర్‌
టెక్నాలజీ ఫర్‌ ఇంపాక్ట్‌ అండ్‌ స్కేల్‌ పేరుతో కాకతీయ శాండ్‌బాక్స్‌ సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో జీఎస్డీపీతోపాటు వివిధ రంగాల్లో ఎలా అభివృద్ధి సాధించామో వివరించారు. మాడరేటర్‌ దేశ్‌పాండే సంధించిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆ తర్వాత కాకతీయ శాండ్‌బాక్స్‌ ఆధ్వర్యంలో రైతుకు అందుతున్న సేవల గురించి ఐదు జిల్లాల రైతులతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. తెలంగాణలో రెండో హరిత విప్లవం (పెరిగిన పంటల సాగు విస్తీర్ణంపై), నీలి విప్లవం (చేపల పెంపకంపై), గులాబీ విప్లవం (గొర్రెల పంపిణీ, పశు సంపదపై), శ్వేత విప్లవం (డెయిరీల లాభాల బాటపై), పశుపు విప్లవం (ఆయిల్‌పామ్‌ సాగు పెంపుపై) సృష్టించామన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో 45 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో గతంలో 26వ స్థానంలో ఉన్న తెలంగాణ... ప్రస్తుతం 3వ స్థానానికి ఎదగడం అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 10 వేల ఎకరాల్లో 16 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

రూ. 50 కోట్ల అంచనాతో ‘కళాభారతి’కి శంకుస్థాపన
సుభాష్‌నగర్‌: మంత్రి కేటీఆర్‌ నిజామాబాద్‌లో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంఠేశ్వర్‌ కమాన్‌ వద్ద రూ. 22 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జిని కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం పాత కలెక్టరేట్‌ వద్ద రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఇందూరు కళాభారతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, బాలలు, అన్ని వర్గాల ప్రజలకు అపురూపమైన కానుక అందించేలా ఇందూరు కళాభారతి నిర్మాణానికి రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు