ఆయుధాలు ఇవ్వాల్సిందే.. టీ సర్కార్‌కు ఫారెస్ట్‌ సిబ్బంది అల్టిమేటం.. విధుల బహిష్కరణకు పిలుపు

23 Nov, 2022 14:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావుపై దాడి ఘటనతో.. అటవీశాఖ సిబ్బంది డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఆయుధాలు ఇస్తేనే తాము విధులు నిర్వహిస్తామంటూ స్పష్టం చేస్తున్నారు వాళ్లు. ఈ క్రమంలో రేపటి నుంచి(గురువారం) నుంచి విధుల బహిష్కరణకు ఫారెస్ట్‌ సిబ్బంది పిలుపు ఇచ్చారు. 

పోలీసులకు ఇచ్చినట్లే ప్రభుత్వం తమకూ ఆయుధాలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు ఫారెస్ట్‌ సిబ్బంది. స్పష్టమైన హామీ ఇస్తేనే విధులకు హాజరు అవుతామని తెలంగాణ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు వాళ్లు. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రకటన ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఖమ్మం ఈర్లపుడిలో గుత్తికోయల దాడిలో మరణించిన శ్రీనివాసరావుకు అంత్యక్రియలు ఇవాళ(బుధవారం) ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకాగా.. ఫారెస్ట్‌ సిబ్బంది తమ నిరసన తెలియజేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. 

ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు, శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్కడి అటవీశాఖ సిబ్బంది. తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు ఆయన తమ వద్ద ప్రస్తావించిన అంశాన్ని సైతం వాళ్లు లేవనెత్తారు. ఫారెస్ట్‌ సిబ్బందిపై దాడుల అంశాన్ని చాలాకాలంగా ప్రభుత్వాల ముందు ఉంచుతున్నామని, ఈ పర్వంలో శ్రీనివాసరావు మృతి ఆఖరిది కావాలంటూ నినాదాలు చేశారు వాళ్లు. ఈ క్రమంలో దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టారు. వీ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వాళ్లను అడ్డుకునే యత్నం చేశారు.

మరిన్ని వార్తలు