ఈ ఏడాదంతా ఉద్యోగ పరీక్షలు

29 May, 2022 01:35 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు   

ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

‘సాక్షి’ మీడియా గ్రూప్, కేసీఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

సాక్షి, సిద్దిపేట: ఉద్యోగ నోటిఫికేషన్ల మధ్య రెండు నెలల సమయం ఉండేలా ఈ ఏడాదంతా పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శనివారం సిద్దిపేటలో ‘సాక్షి’మీడియా గ్రూప్, కేసీఆర్‌ కోచింగ్‌ సెంటర్‌ల ఆధ్వర్యంలో పోటీ పరీక్షలపై అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హరీశ్‌రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 98 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఈ ఏడాదిలో భర్తీ చేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. అన్ని ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్‌ ఇవ్వడం వల్ల కొందరు అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నందున దశల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతీ రెండు నెలలకు ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసేలా మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటులోనూ మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. శిక్షణ శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటలో నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధించడానికి దోహదపడే ఓరియంటేషన్‌ క్లాస్‌ను నిర్వహించడానికి ముందుకు వచ్చిన ‘సాక్షి’ మీడియా గ్రూప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ రోజా శర్మ, హుస్నాబాద్‌ ఆర్‌డీఓ జయచంద్రారెడ్డి, ఎంపీడీఓ రాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు