కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేస్తాం: మంత్రి హరీశ్‌

5 Jul, 2021 03:21 IST|Sakshi

సిద్దిపేట ఎడ్యుకేషన్‌  : ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేస్తుందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు పీఆర్‌సీ అమలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జేఏసీ (జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌) ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటలో రాష్ట్రస్థాయి కృతజ్ఞతా సభను ఏర్పాటు చేశారు. సభకు మంత్రి హాజరై మాట్లాడారు.

ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి 2014 నుంచి నేటి వరకు రూ.567 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి చెప్పారు. పీఆర్‌సీ అమలుతో కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ తదితర 1.20 లక్షల మంది చిరు ఉద్యోగులకు లబ్ధి కలిగిందన్నారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేయాలన్నదే సీఎం ఆకాంక్ష అని పేర్కొన్నారు. పాఠశాల విద్య బలోపేతానికి సబ్‌కమిటీని ఏర్పాటు చేశామని, రూ.4 వేల కోట్ల నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వివరించారు.  

మరిన్ని వార్తలు