మరో 3 రోజులపాటు తెలంగాణలో వర్షాలు

15 Oct, 2020 18:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మధ్య బంగాళాఖాతంలో సుమారు అక్టోబర్‌ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. దక్షిణ మధ్య మహారాష్ట్రతో పాటు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్‌ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తదుపరి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరంకు దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలోనికి ప్రవేశించింది.

దీంతో రాగల 48 గంటలలో మహారాష్ట్ర- దక్షిణ గుజరాత్ తీరాలను ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతాలలో ఇది వాయుగుండముగా బలపడి క్రమేపి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు 18 డిగ్రీ అక్షాంశం వెంబడి ఉత్తర కోస్తా ఆంధ్ర, తెలంగాణ,  దక్షిణ మధ్య మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనంకు అనుబంధముగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వరకు 1.5కిమీ నుంచి 3.1 కిమీ ఎత్తు మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది.

మరిన్ని వార్తలు