అబ్బా.. చలి చంపుతోంది!

10 Jan, 2023 05:01 IST|Sakshi
పాల్వంచ మండలంలోని చిరుతానిపాడులో.. 

2 నుంచి 5 డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రతలు

రెండ్రోజులు మరింత పెరగనున్న చలి

సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో సీజన్‌లోనే అత్యల్పంగా 4.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత

జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్య నిపుణులు  

సాక్షి, హైదరాబాద్‌/కోహీర్‌(జహీరాబాద్‌): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండ్రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ మేర తగ్గినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని హెచ్చరించింది. ఈశాన్యం వైపు నుంచి తక్కువ ఎత్తులో గా­లులు వీస్తున్న నేపథ్యంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వెల్లడించింది.

సోమవారం రాష్ట్రం­లోని వేర్వేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.6 డిగ్రీల సెల్సియస్‌గా నమో దైంది. రాష్టంలో ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొమురం భీమ్‌ జిల్లా సిర్పూర్‌(యు)లో 4.8 డిగ్రీలు రెండో అత్యల్ప ఉష్ణోగ్రత కాగా, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి, వికారాబాద్‌ జిల్లా మర్పల్లి 5 డిగ్రీలతో మూడో స్థానంలో నిలిచాయి. చలి తీవ్రత పెరగడంతో ఉదయం 8 గంటల వరకు ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. తెల్లవా­రుజామున, రాత్రి వేళల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో చలి నుంచి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లో...
కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ గజగజలాడుతోంది. సోమవారం తెల్లవారుజామున శివరాంపల్లిలో కనిష్టంగా 7.3 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. కాగా నగరం మొత్తంగా సరాసరిన 11.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీచేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను అప్రమత్తం చేసింది. 

ఉదయం 10దాటినా తొలగని మంచు
పాల్వంచ రూరల్‌: కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల సమీపాన ఉండే గ్రామాల్లో ఆదివాసీల పరి­స్థితి మరీ దారుణంగా ఉంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలి మొదలవుతుండటం, ఉద­యం 10 గంటల వరకూ మంచు తెరలు వీడకపోవడంతో రాత్రంతా నెగడు (చలి­­మంటలు) వద్దే గడుపుతున్నారు. పడుకునే సమయాన కూడా పక్కన నెగడుకు తోడు దుప్పట్లు కప్పుకుని నిద్రిస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలోని చిరుతాని­పాడులో, పెద్దకలశ, రాళ్లచెలక, బుసురాయి, ఎర్రబోరు తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపించింది.

మరిన్ని వార్తలు