మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు 

3 Aug, 2022 01:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని వెల్లడించింది. చాలాచోట్ల వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర – దక్షిణ ద్రోణి మంగళవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుండి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

తమిళనాడు కోస్తాతీరం, పరిసర ప్రాంతాల్లోని ఆవర్తనం, మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరంలోని పశ్చిమ మధ్య, పరిసర ప్రాంతాల్లోని నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, రాష్ట్రంలో మంగళవారం రంగారెడ్డి జిల్లా మంగళపల్లెలో 12.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా తూఫ్రాన్‌పేటలో 8.3 సెంటీమీటర్లు, కందువాడలో 7.5 సెంటీమీటర్లు, ఇల్లెందులో 7.4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.    

మరిన్ని వార్తలు