రాష్ట్రమంతటా రుతుపవనాల విస్తరణ

17 Jun, 2022 00:54 IST|Sakshi

రాగల మూడురోజుల్లో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు

మహబూబాబాద్‌లో 15 సెంటీమీటర్ల వర్షపాతం

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 13న తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రమంతటా విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాల ఉత్తర పరిమితి ఇప్పుడు పోరుబందర్, భావ్‌నగర్, ఖాండ్వా, గోండియా, దుర్గ్, భవానీపట్నం, కళింగపట్నం గుండా వెళుతోంది. అలాగే ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగింది.

దీంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, చాలా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశముందని తెలిపింది. ఇతర ప్రాంతాల్లోతేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలావుండగా, గత 24 గంటల్లో మహబూబాబాద్‌లో 15 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. నిర్మల్‌ జిల్లా ముధోల్‌లో 13 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలో 12, అశ్వారావుపేటలో 9, మహబూబాబాద్‌ జిల్లా మల్యాల్‌లో 8, జగిత్యాల జిల్లా వెలగటూరు, వరంగల్‌ జిల్లా పర్వతగిరి, కరీంనగర్‌లలో 7సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.   

మరిన్ని వార్తలు