Captcha: నేను రోబోను కాదు!

30 May, 2021 10:17 IST|Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: మనం ఏదో ఒక పని మీద వెబ్‌సైట్లు ఓపెన్‌ చేస్తుంటాం.. ఒక్కోసారి ఆ పేజీలు ఓపెన్‌ కావడానికి ముందు ‘క్యాప్చా (CAPTCHA)’ను కంప్లీట్‌ చేయాలని అడుగుతుంది. అడ్డంగా, పొడుగ్గా సాగదీసి, వంగి ఉన్న అక్షరాలను చూపి.. వాటిని గుర్తించి ఎంటర్‌ చేయాలని అడుగుతుంది. ఇంకొన్ని వెబ్‌ సైట్లలో ‘ఐయామ్‌ నాట్‌ రోబో (నేను రోబోను కాదు)’ అని టిక్‌ చేయాలని కోరుతుంది. మరికొన్నిటిలో చాలా బొమ్మలు పెట్టి.. ఇందులో కారు ఉన్న బొమ్మలను టిక్‌ చేయండి అని అడుగుతుంది.. అసలు ఇవన్నీ ఏమిటి? ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనం రోబోలం కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

వెబ్‌సైట్లకు రక్షణ కోసం
కంప్యూటర్‌ టెక్నాలజీలు పెరిగాక ఆటోమేటిక్‌ ప్రోగ్రాములు, రోబోల రూపకల్పన మొదలైంది. నిర్దేశించిన పనిని, నిర్దేశించిన సమయంలో ఆటోమేటిగ్గా చేసే ఈ ప్రోగ్రాములు, రోబోల సాయంతో వెబ్‌ సైట్లను ఓపెన్‌ చేయడంతోపాటు, పేజీలను రీడ్‌ చేయొచ్చు. ఏదైనా వెబ్‌సైట్‌ను ఒకేసారి పెద్ద సంఖ్యలో ఓపెన్‌ చేయడానికి ప్రయత్నిస్తే.. వెబ్‌సైట్లు, వాటి సర్వర్లు క్రాష్‌ అవుతాయి. దీనితో పాటు వైరస్‌ అటాక్‌లు, ఫిషింగ్, మాల్‌వేర్లను చొప్పించడం వంటివాటిని కూడా ఈ ఆటోమేటిక్‌ ప్రోగ్రాములు, రోబోలు చేయగలుగుతాయి.

ఈ సమస్య నుంచి బయటపడటానికే ‘క్యాప్చా’ విధానాన్ని అభివృద్ధి చేశారు. క్యాప్చా అంటే.. ‘కంప్లీట్లీ ఆటోమేటెడ్‌ పబ్లిక్‌ ట్యూరింగ్‌ టెస్ట్‌ టు టెల్‌ కంప్యూటర్స్‌ అండ్‌ హ్యూమన్స్‌ అపార్ట్‌’. వెబ్‌సైట్లను రోబోలు, ఆటోమేటిక్‌ ప్రోగ్రాముల నుంచి రక్షించేందుకు.. 2000వ సంవత్సరంలో దీనిని రూపొందించారు. మనుషులు సులువుగానే గుర్తించగలిగి.. కంప్యూటర్లు గుర్తించలేని చిన్నపాటి పరీక్ష ఇది అని చెప్పొచ్చు.

అక్షరాలను గుర్తించడంతో..
అక్షరాలను చదివి గుర్తించడంలో మనుషులకు మంచి  నైపుణ్యం ఉంటుంది. మనకు తెలిసిన అక్షరాలు వంగి ఉన్నా, సాగదీసి ఉన్నా,  వివిధ రకాల ఫాంట్లలో ఉన్నా కూడా మనం కాస్త సులువుగానే గుర్తించగలం. ఈ సామర్థ్యమే మొదట క్యాప్చా రూపకల్పనకు మార్గం చూపింది. కంప్యూటర్లు ‘ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌’ సాంకేతికత సాయంతో అక్షరాలను గుర్తిస్తాయి. అవి నిర్దేశించిన మేరకు మాత్రమే కచ్చితంగా అంచనా వేస్తాయి. మనుషుల తరహాలో భిన్నమైన వాటిని గుర్తించలేవు.

క్యాప్చా: ఒకే పదంతో పరీక్ష
మొదట్లో ఒకే పదం ఉన్న క్యాప్చాలను ఉప యోగించారు. ప్రోగ్రామర్లు కంప్యూటర్‌కు ముందే ఒక పదాన్ని ఇస్తారు. అంటే క్యాప్చా ఏమిటనేది ఈ కంప్యూటర్‌కు ముందే తె లుస్తుంది. తర్వాత ఆ పదాన్ని సాగదీసి, వంచి, అక్షరాలను కూడా వేర్వేరుగా సాగదీసి.. వాటి మధ్య దూరం పెంచి ఒక ఇమేజ్‌ను తయారు చేస్తారు. దీనిని క్యాప్చాగా పెడతారు. మను షులు ఆ పదాన్ని లేదా అక్షరాలను గుర్తించి.. పక్కనే ఇచ్చిన బాక్స్‌లో నమోదు చేస్తారు.

కంప్యూటర్‌ దానిని సరైనదిగా గుర్తించి వెబ్‌పేజీని ఓపెన్‌ చేస్తుంది. ఆటోమేటిక్‌ ప్రోగ్రాములు, రోబోలు ఈ క్యాప్చాలను అర్థం చేసుకోలేకపోతాయి కాబట్టి వెబ్‌పేజీ ఓపెన్‌కాదు. ప్రతిసారి ప్రోగ్రామర్లు పదాలను ఇవ్వలేరు కాబట్టి.. ముందే వేల సంఖ్యలో పదాలను కంప్యూటర్‌కు ఇచ్చారు. కంప్యూటరే ప్రతిసారి ఆటోమేటిగ్గా వాటిల్లోంచి ఓ పదాన్ని ఎంపిక చేసి.. వంచి, సాగదీసి క్యాప్చాలుగా పెడుతుంది.

రీక్యాప్చా:  రెండు పదాలతో..
సాంకేతికత పెరిగిన కొద్దీ ఈ పరీక్షను కాస్త కష్టతరం చేసేందుకు 2005లో రీక్యాప్చాను ప్రవేశపెట్టారు. ఇందులో రెండు పదాలు ఉంటాయి. ఒక పదాన్ని కంప్యూటర్‌ నేరుగా సృష్టించి ఇస్తుంది. స్కాన్‌ చేసి పెట్టిన పాత పుస్తకాలు, ఆర్టికల్స్‌ నుంచి మరో పదాన్ని ఇస్తుంది. మనం ఈ రెండు పదాలను నమోదు చేస్తే వెబ్‌పేజీ ఓపెన్‌ అవుతుంది.

ఆ పదాలన్నీ  డిజిటలైజ్‌
పాత పుస్తకాలు, ఆర్టికల్స్‌ను స్కాన్‌ చేసిన ఈ పదాలను మనం రీక్యాప్చా ల్లో ఎంటర్‌ చేస్తుం టాం. మరి అవన్నీ ఏమైపోతున్నాయో తెలుసా? కంప్యూటర్‌ మళ్లీ వాటిని తీసుకెళ్లి వరు సగా అమర్చుతుంది. చివరికి అదంతా డిజిటలైజ్‌ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగిస్తారు కాబట్టి ఇది భారీగా ఉం టుంది. ఎంత అంటే.. అమెరికాలోని న్యూ యార్క్‌ టైమ్స్‌ పత్రికలో ఏడాది పాటు వచ్చిన ఆర్టికల్స్‌ అన్నీ నాలుగు రోజుల్లో డిజిటలైజ్‌అయిపోతాయన్నమాట. 2009లో ఈ ‘రీక్యాప్చా’ను కొనుగోలు చేసిన గూగుల్‌ సంస్థ.. పుస్తకాలను డిజిటలైజ్‌ చేయడానికి ఈ టెక్నాలజీని వినియోగిస్తోంది.

కృత్రిమ మేధతో దెబ్బ!
2010–12 తర్వాత కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌– ఏఐ) బాగా అభివృద్ధి చెందింది. ఎంతగా వంచడం, సాగదీయడం వంటివి చేసినా కూడా అక్షరాలను గుర్తించగల సామర్థ్యం రోబోలు, ప్రోగ్రాములకు సమకూరాయి. అవి క్యాప్చాలను సులువుగా పరిష్కరించడం మొదలుపెట్టాయి. æ2014లో గూగుల్‌ మెషీన్‌ లెర్నింగ్‌ అధ్యయనం ప్రకారం.. ఎక్కువ స్థాయిలో మార్చిన అక్షరాలను మనుషులు 33 శాతం కచ్చితత్వంతో గుర్తిస్తే.. ఏఐ ఆధారిత రోబోలు, ప్రోగ్రాములు ఏకంగా 99.8 శాతం కచ్చితత్వంతో గుర్తించగలిగాయి.

రీక్యాప్చా వీ2:  చిత్రాల సాయంతో..
ఇలా జరగడంతో ఏఐ ఆధారిత ప్రోగ్రాములు, రోబోల నుంచి తప్పించు కునేందుకు వెబ్‌సైట్లకు చిత్రాలతో కూడిన ‘రీక్యాప్చా వీ2’ను రూపొందించారు. 2015–16 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఇందులో కొన్ని చిత్రాలు చూపించి.. అందులో కొన్నింటిని గుర్తించే పరీక్ష పెట్టారు. ఉదాహరణకు.. చిత్రాల్లో ట్రాఫిక్‌ లైట్లు, రోడ్లు, షెడ్లు, చెట్లు, వాటి భాగాలు ఉన్న వాటిని గుర్తించాల్సి ఉంటుంది. అయితే, గూగుల్‌ తమ గూగుల్‌ మ్యాప్స్‌ను మెరుగుపర్చేందుకు ఈ డేటాను వాడుకుంటుండటం గమనార్హం. æ ఇంత చేసినా కూడా ఏఐ కంప్యూటర్‌ ప్రోగ్రాములు, రోబోలు వీటినీ సులువుగా గుర్తించడం మొదలుపెట్టాయి.

రీక్యాప్చా వీ3:  జస్ట్‌ క్లిక్‌ చేస్తే చాలు
అన్ని రకాల క్యాప్చా పరీక్షలను ప్రోగ్రాములు, రోబోలు పరిష్కరిస్తుండటంతో.. కొత్తగా ‘రీక్యాప్చా వీ3’ని కొంతకాలంగా వినియోగిస్తున్నారు. ఇందులో వినియోగదా రుడు నేరుగా ఎలాంటి పరీక్ష ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. కేవలం ‘ఐయామ్‌ నాట్‌ రోబో’ అని ఉన్న డిక్లరేషన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ‘రీక్యాప్చా వీ3’ కూడా కృత్రిమ మేధ ఆధారంగా పనిచే స్తుంది.

ఇది వెబ్‌పేజీల బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూ.. వినియోగిస్తున్నది మనుషులేనా, కాదా అన్నదానిపై నిఘా పెడుతుంది. ఉదాహరణకు మౌస్‌తో అత్యంత వేగంగా, అత్యంత కచ్చితంగా క్లిక్స్‌ చేయడం, వేగంగా టైపింగ్‌ చేయడం, చకచకా ఆప్షన్లు ఎంపిక చేసుకోవడం వంటి రోబోలు చేసే పనులు.. వీటి ఆధారంగా అది మనిషా, రోబోనా అని గుర్తిస్తుందన్నమాట. చూశారుగా.. మనం రోబో కాదని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయాసలు పడాల్సి వస్తోందో.. 
చదవండి: ఈ యాప్స్‌తో ఒత్తిడి పరార్‌..!

మరిన్ని వార్తలు