టీకా వేసుకున్నా కరోనా వస్తుందా? వస్తే రెండో డోసు పరిస్థితి ఏమిటి?

25 Apr, 2021 08:40 IST|Sakshi

హైదరాబాద్‌: కరోనా టీకా వేసుకున్న తర్వాత కూడా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. నిజానికి టీకా రెండో డోసు తీసుకున్న 15 రోజుల తర్వాత పూర్తిస్థాయి ఇమ్యూనిటీ సమకూరుతుంది. ఇన్‌ఫెక్షన్‌ వచ్చే చాన్స్‌ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా చాలా స్పల్పంగా లక్షణాలు ఉంటాయి. ప్రాణహాని ఉండదు. ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాల్సిన అవసరం కూడా ఉండదు. 9 నుంచి 12 నెలల పాటు రక్షణ ఉంటుంది. తర్వాత మళ్లీ టీకా వేయించుకోవాల్సిందే. టీకా వేసుకున్న తర్వాత సైడ్‌ ఎఫెక్ట్స్‌ (జ్వరం, తలనొప్పి, నీరసం, కండరాల నొప్పులు) సాధారణమే.

ఈ లక్షణాలు మంచి సంకేతమే. ఇమ్యూనిటీ సిస్టం పనిచేస్తున్నట్లు లెక్క. భయపడాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు ఒకట్రెండు రోజుల్లోనే తగ్గిపోతాయి. ఎవరైనా మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకునేలోగా కరోనా పాజిటివ్‌ వస్తే.. కోవిడ్‌ తగ్గేదాకా ఆగాలి. అప్పటికే వారు తీసుకున్న మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వృథా కాదు. కాబట్టి నేరుగా రెండో డోస్‌ తీసుకోవచ్చు. పైగా కరోనా వచ్చిపోయినవారిలో యాంటీబాడీలు ఉంటాయి. అందువల్ల డోసుల మధ్య విరామం ఎక్కువగా వచ్చిందన్న భావనతో మళ్లీ మొదటి డోస్‌ వేసుకోవాల్సిన అవసరం లేదు. టీకా వేసుకున్నాక ఎండలో తిరగొద్దనే నియమాలేమీ లేవు. మద్యపానం అలవాటున్న వారు వారం పది రోజుల పాటు దానికి దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాక్సిన్‌ వేసుకున్నాక పాటించాల్సిన ఆహార నియమాలు అంటూ ఏమీ లేవు.

-డాక్టర్‌ శ్రీహర్ష యాదవ్, హైదరాబాద్‌ జిల్లా సర్వెలెన్స్‌ ఆఫీసర్‌  

( చదవండి: కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? )

మరిన్ని వార్తలు