Chicken Biryani: వారెవ్వ ఏమి ఫుడ్డు.. ఫుడ్‌ ఆర్డర్లలో బిర్యానీదే హవా.. సెకండ్‌ ప్లేస్‌లో ఏముందంటే..

22 Dec, 2021 08:04 IST|Sakshi

అభి‘రుచుల’తో పాటూ ఆరోగ్య స్పృహ

నగరంలో ఆరోగ్యకర ఆహారానికీ ఆదరణ

దేశంలోనే తొలిస్థానంలో బెంగళూరు

ద్వితీయ స్థానంలో నిలిచిన హైదరాబాద్‌

స్విగ్గీ వార్షిక నివేదికలో వెల్లడి

గతంతో పోలిస్తే హైదరాబాదీలలో ఆరోగ్య స్పృహ పెరిగిందనేది ఫుడ్‌ ఆర్డర్ల ద్వారా మరోసారి రుజువైంది. విందు వినోదాల వీకెండ్‌ తర్వాత రోజు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ.. వార్షిక నివేదిక వెల్లడించిన ఆసక్తికరమైన అంశాలివీ..
 – సాక్షి, హైదరాబాద్‌
 
గ్రాసరీస్‌తో సహా విభిన్న రకాల కేటగిరీ ఉత్పత్తులను స్విగ్గీ అందిస్తున్నప్పటికీ.. మొత్తం ఆర్డర్లలో 48 శాతం ఫుడ్‌కు సంబంధించినవే.  ఈ ఏడాది పెట్‌ ఫుడ్‌ కూడా ఆర్డర్లు బాగా పెరిగాయి. ఆసక్తికరంగా.. 20వేల ఆర్డర్స్‌ పెట్‌ ఫుడ్‌ కోసం వచ్చాయి. 

ఫుడ్‌ ఫర్‌ హెల్త్‌..  
ఆరోగ్యకరమైన ఆహారం కోరుతూ హెల్త్‌ హబ్‌కి ఆర్డర్లు ఈ ఏడాది 200 శాతం పెరిగాయి. దేశంలోనే ఆరోగ్య స్పృహ కలిగిన ఆహారం కోరే నగరాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా గతం కంటే మెరుగ్గా హైదరాబాద్‌ రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. విందూ వినోదాలు ఎక్కువగా జరిగే వారాంతపు రోజుల అనంతరం సోమవారం ఆరోగ్యకర ఆహారం గురించి ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటే.. ఆ తర్వాత స్థానం గురువారం దక్కించుకుంది. కీటో శైలి ఫుడ్‌లో 23 శాతం వృద్ధి కనిపించగా, వెగాన్‌ శైలి, శాకాహారపు ఆర్డర్స్‌లో 83 శాతం పెరుగుదల నమోదైంది.
చదవండి: అంతరిక్షానికీ ఫుడ్‌ డెలివరీ..  

సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్‌.. 
నగరంలో చికెన్‌ బిర్యానీ ఆర్డర్లకే ఫస్ట్‌ ప్లేస్‌ దక్కుతోంది. అలాగే యాప్‌ని తొలిసారి వినియోగిస్తున్నవారిలో అత్యధికులు చికెన్‌ బిర్యానీతోనే అరంగేట్రం చేస్తున్నారట. దేశవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వస్తే.. ఈ ఏడాది అది 115కి పెరిగింది. అంటే సెకనుకు 2 బిర్యానీలుగా చెప్పొచ్చు. చికెన్‌ బిర్యానీ వినియోగంలో వరుసగా చెన్నై, కోల్‌కతా, లక్నో, హైదరాబాద్‌లు టాప్‌లో ఉన్నాయి. ముంబైలో మాత్రం చికెన్‌ బిర్యానీని దాల్‌ కిచిడీ దాటేసింది. 
చదవండి: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి !

బ్రౌనీస్‌ బాక్స్‌ డెలివరీకి 43.3 కి.మీ జర్నీ.. 
► అత్యధిక దూరం ప్రయాణం చేయించిన ఆర్డర్లలో నగరానికి రెండో స్థానం దక్కింది. ఓ కస్టమర్‌ తన ప్రియ నేస్తానికి ఆర్డర్‌ చేసిన చాక్లెట్‌ బ్రౌనీస్‌ బాక్స్‌ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అందించడం కోసం సిటీకి చెందిన డెలివరీ బాయ్‌ 43.3 కి.మీ ప్రయాణం చేశాడు. 

► ఈ విషయంలో ప్రథమ స్థానం దక్కించుకున్న బెంగళూరులో ఫుడ్‌ ప్యాక్‌ అందించడానికి  ఓ స్విగ్గీ బాయ్‌ ఏకంగా 55.5 కి.మీ ప్రయాణం చేశాడు. కోల్‌కతాలో ఓ బిర్యానీ ప్రేమికురాలు తనకు ఇష్టమైన మటన్‌ బిర్యానీ కోసం 39.3 కి.మీ ప్రయాణం చేయించింది.  
చదవండి: బిర్యానీ కోసం టెంప్ట్‌ అయ్యాడు, అలా ఆర్డర్‌ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు

మనసు దోసె... 
దోసెలు ఆర్డర్‌ చేయడంలో బెంగళూరు టాప్‌లో ఉంది. బటర్‌ దోసె ఆర్డర్లలో బెంగళూరు తర్వాత స్థానం నగరానికి దక్కగా ముంబై మూడో స్థానంలో ఉంది. నగరవాసులు అత్యధికంగా ఆర్డర్‌ చేసిన వాటిలో.. చికెన్‌ బిర్యానీ తొలిస్థానంలో ఉండగా, చికెన్‌ 65 తర్వాతి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో పన్నీర్‌ బటర్‌ మసాలా నిలవగా, మసాలా దోసె 4, ఇడ్లీ 5వ స్థానాల్లో నిలిచాయి.

సాధారణంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఫుడ్‌ ఆర్డర్స్‌ ఎక్కువ. రాత్రి 10 గంటల తర్వాత స్నాక్స్‌కు ఆర్డర్స్‌ పెరిగాయి. 80 శాతం మంది ఆన్‌లైన్‌ ద్వారా పేమెంట్స్‌కు మొగ్గు చూపుతున్నారు కొద్దిమంది మాత్రమే డెలివరీ తర్వాత నగదు చెల్లిస్తున్నారు. 

మరిన్ని వార్తలు