వాట్సాప్‌తో హ్యాండ్సప్‌!

10 Jan, 2021 01:33 IST|Sakshi

వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించేలా వాట్సాప్‌ కొత్త పాలసీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ వాట్సాప్‌.. తన వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే నిర్ణయం తీసుకుంది. వినియోగదారులంతా తమ వివరాలు ఇస్తేనే యాప్‌లో కొనసాగాలని.. లేకుంటే నిరభ్యంతరంగా బయటకు వెళ్లిపోవచ్చని స్పష్టంచేసింది. ఈ మేరకు నవీకరించిన నిబంధనలు, గోప్యత విధానానికి వచ్చేనెల 8వ తేదీలోగా అంగీకారం తెలపాలని షరతు విధించింది. ఈ మేరకు తమ కొత్త ప్రైవసీ పాలసీకి సమ్మతి తెలపాలని కోరుతూ పాప్‌–అప్‌ మెసేజ్‌లు పంపిస్తోంది. దీనికి అంగీకరిస్తేనే ఫిబ్రవరి 8 తర్వాత వాట్సాప్‌ ఖాతా పనిచేస్తుంది.

బతుకు బహిరంగమేనా..?
వాట్సాప్‌ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామి అయిపోయింది. వ్యక్తిగత చాట్స్‌తో పాటు ఫోటోలు, వీడియోలు, వాయిస్‌ మెసేజ్‌లు, ఫైల్స్, షేర్‌ లొకేషన్‌ మెసేజ్‌లను పంపడానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మందికి పైగా దీనిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వాట్సాప్‌ తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీతో వాట్సాప్‌ సేవలతో పాటు వినియోగదారుల డేటా ప్రాసెసింగ్‌ ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ పాలసీకి ఆమోదం తెలిపిన తర్వాత వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్, ఇతర అనుబంధ కంపెనీల వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకుంటుంది. ఈ–కామర్స్‌ సంస్థలకు వినియోగదారుల డేటాను అమ్ముకుంటుంది. తొలుత ఈ విధానాన్ని బ్రిటన్, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబోతోంది. 

గోప్యతకు ప్రమాదం లేదంటూనే...  
వాట్సాప్‌లో సందేశాలన్నీ సంకేతభాష (ఎన్‌క్రిప్టెడ్‌)లోకి తర్జుమా అవుతాయని, ఆ డేటాను తాము కూడా చూడలేమని సంస్థ అంటోంది. సందేశాలు డెలివరీ అయ్యాక, తమ సర్వర్‌ నుంచి డిలీట్‌ అయిపోతాయని పేర్కొంటోంది. ఏదైనా పాపులర్‌ ఫోటో, వీడియోను ఎక్కువ మంది షేర్‌ చేస్తే దాన్ని మాత్రమే సర్వర్‌లో దీర్ఘకాలం స్టోర్‌ చేస్తామని అంటోంది. తాము కానీ, థర్డ్‌ పార్టీలు కానీ వినియోగదారుల సమాచారాన్ని చదవలేరని స్పష్టంచేస్తోంది. తమ వినియోగదారులు, వ్యాపార సంస్థలు వాట్సాప్‌ను వినియోగించుకుని మెరుగైన పద్ధతిలో కమ్యూనికేట్‌ కావడానికి మాత్రమే కొత్త దారులు వెతుకుతున్నామని, ఈ క్రమంలోనే కొత్త ప్రైవసీ పాలసీ తీసుకొచ్చామని చెబుతోంది. వినియోగదారుల మొబైల్‌ ఫోన్‌ నంబర్, ఫోన్‌ కాంటాక్స్, ప్రొఫైల్‌ పేరు, ప్రొఫైల్‌ పిక్చర్, స్టేటస్‌ మెసేజ్‌ వంటి సమాచారాన్ని వారి సమ్మతి ద్వారా తీసుకుంటామని అంటోంది. 

ఫేస్‌బుక్‌కు ఏమేం ఇస్తుంది? 
వాట్సాప్‌ వినియోగదారుల అకౌంట్‌ రిజిస్ట్రేషన్‌ సమాచారం(ఫోన్‌ నంబర్‌), వాట్సాప్‌తో జరిపే ఆర్థిక లావాదేవీలు, సేవల సంబంధిత సమాచారం, ఇతరులతో మీరు ఎలా ఇంటరాక్ట్‌ అవుతున్నారు? మీ మొబైల్‌ఫోన్‌ హార్డ్‌వేర్‌ సమాచారం, ఐపీ అడ్రస్, లొకేషన్, మీరు సందర్శించిన వెబ్‌సైట్లు వంటి వివరాల ను ఫేస్‌బుక్, ఇతర అనుబంధ కంపెనీలకు ఇవ్వనుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ వినియోగదారులంతా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వాట్సాప్‌ తాజా నిర్ణయం నేపథ్యంలో టెలిగ్రాం, సిగ్నల్‌ వంటి ప్రత్యామ్నాయ యాప్‌లు వినియోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు