ఇకపై వీళ్లు కూడా మీపై ఓ కన్నేసే ఉంచుతారు!

6 Feb, 2021 19:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడమే కాకుండా.. జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు పడే పాట్లు వర్ణనాతీతం. ఆ మధ్య కేబుల్‌ బ్రిడ్జిపై ఫొటోల కోసం ఆగిన ఓ కుటుంబం, రోడ్డుకు అడ్డంగా నిలుచోవడమే గాకుండా, తమ బండి నంబరు కెమెరాకు చిక్కకుండా చున్నీని అడ్డుపెట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక మొన్నటికి మొన్న, హెల్మెట్‌ లేకుండా ప్రయాణం చేయడమే కాకుండా ట్రిపుల్‌ రైడింగ్‌ వెళ్తూ, నంబరు ప్లేటు కనిపించకుండా ఓ మహిళ కాలు అడ్డుపెట్టిన ఫొటోలు ఎంతగా వైరల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిలాగే, చలానాలు తప్పించుకోవడం కోసం బైకర్లు చేస్తున్న చిత్రవిచిత్ర విన్యాసాల ఫొటోలను సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూనే ఉన్నారు. (చదవండి: ఎంత పని జేశినవ్‌ అక్క..!)

పైగా అలాంటి వారికి ఎలా బుద్ధి చెప్పామో ఫన్నీ మీమ్స్‌ ద్వారా తెలియజేస్తున్నారు. అయితే దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం... నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలే గానీ, ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలు చేయరాదని చెప్పడమే. అయినా మంచిగా చెప్తే ఎవరు మాత్రం వింటారు.. అందుకే ఓవైపు అవగాహనా కార్యక్రమాలు చేపడుతూనే, మరోవైపు భారీ జరిమానాలతో షాకులిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘బీ సిటిజెన్‌ పోలీస్(పౌర పోలీసు)‌’  అంటూ బాధ్యత గల పౌరులుగా మెలగమంటూ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఓ వాట్సాప్‌ నంబరును షేర్‌ చేశారు. ఈ మేరకు.. ‘‘సైబబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన ట్రాఫిక్‌ ఉల్లంఘనను బండి నెంబరుతో సహా ఫొటో/వీడియో తీసి, తేది, ప్రదేశం, సమయం జత పరిచి 9490617346 నంబరుకు వాట్సాప్‌ చేయండి. తగు చర్య తీసుకుని మీకు తెలియజేస్తాం. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం’’ అంటూ ఓ నంబరును ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు