ఇంట్లో దెయ్యం.. కాలనీ మొత్తం ఖాళీ

24 Feb, 2021 03:06 IST|Sakshi
కాలనీవాసుల ఆందోళనకు కారణమైన పాడుబడిన భవనం

దెయ్యం భయంతో కాలనీ ఖాళీ చేసిన వాసులు 

పాడుబడిన భవనంతో బేడ, బుడగ జంగాల ఆందోళన 

వలసపోయిన 40 కుటుంబాలు

సాక్షి, తరిగొప్పుల: దెయ్యం తిరుగుతోందన్న భయంతో బేడ, బుడగజంగాల ప్రజలు తాముంటున్న కాలనీని ఖాళీ చేసి వలస పోయారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో ఇలా సుమారు 40 కుటుంబాలు కాలనీని విడిచిపెట్టి పోవడంతో ఇప్పుడా కాలనీ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది. పదేళ్లుగా కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఓ పాడుబడిన భవనంలో రాత్రిళ్లు దెయ్యం తిరుగుతోందని, ఓ మహిళ నగ్నంగా బోనం ఎత్తుకుని నృత్యం చేస్తోందని కాలనీ వాసులు నమ్ముతున్నారు.

వరుస మరణాలతో ఆందోళన.. 
బేడ బుడగ జంగాల కాలనీలో అన్నదమ్ములు చింతల భాను, చింతల బాలరాజు గతేడాది అక్టోబర్‌లో వారం వ్యవధిలోనే మరణించారు. అదే కాలనీకి చెందిన గంధం రాజు తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ మరణాలకు చేతబడి, దెయ్యమే కారణమని కాలనీవాసులు నమ్మడంతో ఒక్కొక్కరుగా వలస వెళ్లిపోతుండటంతో మంగళవారానికి కాలనీ పూర్తిగా ఖాళీ అయింది. ఇక కాలనీకి చెందిన గంధం శేఖర్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ..తమ కాలనీలో యువకులు మాత్రమే చనిపోతున్నారని, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్తే రిపోర్టుల్లో ఏమీ లేదంటున్నారని తెలిపారు. దీంతో భయం వేసి కాలనీని వదిలి మండల కేంద్రానికి వెళ్లి గుడిసెలు వేసుకుంటున్నట్లు వివరించారు. 

►పోలీసులు, కళాజాత బృందం ఆధ్వర్యంలో దెయ్యం, భూతం లేదని అవగాహన కల్పించినా ఎవరూ నమ్మడం లేదు. వేరేచోట స్థలం కేటాయిస్తామని చెప్పినా ఎవరూ వినట్లేదు.  –ఎండబట్ల అంజమ్మ, గ్రామ సర్పంచ్

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు