‘ఐరోపా సిలికాన్‌ వ్యాలీ’కి వెళతారా?

20 Aug, 2020 17:47 IST|Sakshi

హైదరాబాద్‌: ‘ఐరోపా సిలికాన్‌ వ్యాలీ’గా పేరు గాంచిన ఐర్లాండ్‌ ఇప్పుడు భారత విద్యార్థులకు ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతోంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం ఐర్లాండ్‌వైపు చూస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పలు టెక్‌ కంపెనీలు కూడా ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. (భ‌ర్త లేడు: కొడుకును పెళ్లాడిన‌ త‌ల్లి?)

‘ఉన్నత చదువుల కోసం మొదట్లో అమెరికా వెళ్లాలనుకున్నాను. వర్క్‌ వీసా పొందడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని తెలిసి యూఎస్‌ ఆశలు వదిలేసుకుని ఐర్లాండ్‌ను ఎంచుకున్నా. అమెరికాతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు వర్క్‌ వీసా సులువుగా పొందవచ్చు’ అని డబ్లిన్‌ బిజినెస్‌ స్కూల్‌లో చదువుతున్న రాకేశ్‌రెడ్డి బాదం తెలిపారు. శాశ్వత నివాసానికి అవసరమైన విధానం చాలా సులువుగా,  సరళంగా ఉంటుందని వెల్లడించారు. 

పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలు కూడా సులభంగానే దొరుకుతాయని మార్కెటింగ్‌లో ఎంబీఏ చేస్తున్న అఖిల్‌ పుల్లినేని అనే విద్యార్థి చెప్పారు. యూరప్‌ దేశాల్లో బ్రిటన్‌తో పాటు ఐర్లాండ్‌లో మాత్రమే అదనంగా మరో భాషను ఎంచుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. (పేద దేశాలకూ కరోనా టీకా అందాలి)

తమ దేశంలో నివాసానికి, చదువులకు అయ్యే ఖర్చు తక్కువని ఐర్లాండ్‌ ఎడ్యుకేషన్‌ సీనియర్‌ సలహాదారు బ్యారీ ఓడిస్కోల్‌ అన్నారు. ఏడాది పీజీ కోర్సుకు దాదాపు 11.16 నుంచి 19.6 లక్షల రూపాయల వరకు ఫీజు ఉంటుందన్నారు. విద్యార్థులు సంవత్సరానికి 10 వేల యూరోలు(సుమారు రూ. 8.9 లక్షలు)తో గడిపేయొచ్చని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే ఐర్లాండ్‌కు వస్తున్న భారత విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నమాట వాస్తమేనని అంగీకరించారు. ‘సంప్రదాయ ప్రత్యామ్నాయాలతో పోల్చుకుంటే ఉన్నత విద్యకు ఐర్లాండ్‌ మంచి గమ్యస్థానమని విద్యార్థులు భావిస్తున్నార’ని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు రెండేళ్ల స్టే బ్యాక్ వీసాను అందిస్తున్నట్టు వెల్లడించారు. బిజినెస్‌, సైన్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని.. బిగ్‌ డేటా, సైబర్‌ సెక్యురిటీ కోర్సులకు బాగా డిమాండ్‌ ఉందన్నారు. 

మరిన్ని వార్తలు