నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు ట్యాప్‌ చేస్తుందా?

3 Oct, 2022 15:48 IST|Sakshi

ఎప్పుడు ప్ర‌శాంతంగా ఉండే కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి కోప‌మొచ్చింది. కోపంలో కూడా సాఫ్ట్‌గా మాట్లాడే కిష‌న్‌రెడ్డి ఆవేశంగా మాట్లాడేంత పొర‌పాటు బీజేపీ కార్యాల‌యంలో ఏం జ‌రిగింది ? ఫోన్ ట్యాపింగ్ గురించి ఘాటుగా ఎందుకు స్పందించారు ? ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జోరుగా చ‌ర్చ‌సాగుతోంది.

ఇంటెలిజెన్స్ అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నది సరిపోవడం లేదని.., ఇంకా బీజేపీ కార్యాలయంలోకి కూడా వస్తున్నారా? అంటూ నిలదీశారు. అసలు పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించేదుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటెలిజెన్స్ అధికారులను చూసి తీవ్రంగా ఫైరయ్యారు. 

బీజేపీ కార్యాలయంలోకి మరోసారి వస్తే బాగోదని వారిని హెచ్చరించారు. ప్రగతి భవన్, తెలంగాణ భవన్ లో ఐబీ వాళ్ళను పెడితే ఒప్పుకుంటారా అంటూ నిలదీశారు. దీనికి ఒప్పుకుంటే.. రాష్ట్ర ఇంటలిజెన్స్ ను బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేయిస్తానంటూ కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గ‌తంలో బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌రుగుతున్న సంద‌ర్భంలో రాష్ట్ర నిఘా విభాగం అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. స‌మావేశ మందిరంలోకి వెళ్లి తీర్మానం కాపీల‌ను ఫోటోలు తీసిన ఇంట‌లిజెన్స్ అధికారిని ప‌ట్టుకుని లోక‌ల్ పోలీసుల‌కు అప్ప‌గించారు. అప్ప‌టి నుంచి ఇంట‌లిజెన్స్ శాఖ అధికారుల తీరుపై కాషాయ పార్టీ నేత‌లు అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. స‌హ‌జంగానే స‌మాచారం బ‌య‌ట పెట్టాల‌ని ఇష్ట‌ప‌డ‌ని బీజేపీ... ఇంట‌లిజెన్స్ అధికారుల తీరుపై అభ్యంత‌రాలున్నాయి. అది కిష‌న్‌రెడ్డి రూపంలో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

కేంద్ర‌మంత్రిగా ఉన్న కిష‌న్‌రెడ్డి  ఫోన్ల ట్యాపింగ్ అంశం మాట్లాడ‌టం కొత్త చర్చకు దారి తీసింది. ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించడం వివాదాస్పదంగా మారనుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేస్తోందని, ఇందుకు పెగాసెస్ అనే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారని కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఈ అంశం మొత్తం పార్లమెంట్‌ను సైతం కుదిపేసింది. ఇప్పుడు ఇదే తరహా కామెంట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేశారు. తమ పార్టీకి చెందిన నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను తేలికగా తీసుకునే ఆస్కారం లేకుండాపోయింది. సెంట్ర‌ల్‌ మినిస్టర్ గా ఉన్న కిష‌న్ రెడ్డి కచ్చితమైన సమాచారంతోనే ఇలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఒక్క బిజేపీ నేతలవే కాదు.. టీఆర్ఎస్ నేతలు, ఐఏఎస్ అధికారుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుందా? చేస్తే ఎవరెవరివి చేస్తోంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వార్తలు