వారంలో ఇంటర్‌ సిలబస్, పరీక్షల షెడ్యూలు

20 Jan, 2021 08:14 IST|Sakshi

ఎంసెట్, జేఈఈ, నీట్‌ పరీక్షల సిలబస్‌పైనా స్పష్టత

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన సిలబస్, పరీక్ష తేదీలు, ప్రాక్టికల్స్‌కు సంబంధించిన అంశాలపై వారం రోజుల్లో స్పష్టత ఇస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా ఎంసెట్‌ పరీక్ష సిలబస్‌ ఉం టుందని, ఈ విషయంలో మరింతగా చర్చించి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా తరగతుల నిర్వహణకు సంబంధించి ప్రతి విద్యా సంస్థ కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలలను ప్రారంభించాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రైవేటు విద్యా సంస్థలు సహకారం అందించాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి చెప్పారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, పాఠశాల విద్యాకమిషనర్‌ దేవసేన పాల్గొన్నారు.

14 డిమాండ్లు పరిష్కరించండి
కాగా, పాఠశాలలు, కాలేజీలకు సంబంధించి యాజమాన్యాలు ఎదుర్కొంటున్న 14 అంశాలను, సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు యాజమాన్యాలు మంత్రిని కోరాయి. ఫీజలు రాక ఏడాది నుంచి విద్యా సంస్థల నిర్వహణ కష్టంగా మారిందని పేర్కొన్నాయి. జూన్‌ వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని, కనీస హాజరు ఉండేలా నిబంధనను విధించాలని కోరాయి. అన్ని తరగతులను కూడా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు