ఉమ్మడి కరీంనగర్‌కు కొత్త ఆశలు.. వందే భారత్‌ రైలు వచ్చేనా..?

30 Jan, 2023 08:03 IST|Sakshi

రైలు సదుపాయాలు పొందాలి 

ఉమ్మడి జిల్లాకు వందే భారత్‌ రైలు వచ్చేనా..?

ఇంకా పూర్తికాని కొత్తపల్లి – మనోహరాబాద్‌ లైన్‌

పట్టాలెక్కని నిజామాబాద్‌ – పెద్దపల్లి డబ్లింగ్‌ పనులు

కరీంనగర్‌– తిరుపతి రైలు అదనపు ట్రిప్పుల కోసం నిరీక్షణ

కేంద్ర బడ్జెట్‌ 2023–24పై ఆశలు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌–2023–24 ఏడాదిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులు, డిమాండ్లు, పనులకు ప్రాధాన్యం దక్కుతుందా..? లేదా అన్న ఉత్కంఠ మొదలైంది. ఈ ప్రాంతంలో రవాణా, పర్యాటకం, పారిశ్రామికం, మానవ వనరులతోపాటు అన్నిరంగాల్లోనూ ముందంజలో ఉంచేందుకు దోహదపడే కీలక రైల్వే ప్రాజెక్టులకు నిధులు వస్తాయా..? జాబితాలో చోటు దక్కించుకుంటాయా..? ప్రతిపాదనలు వాస్తవరూపం దాలుస్తాయా..? అని ఉమ్మడి జిల్లా వాసులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రైల్వేస్టేషన్లలో సదుపాయాల కల్పన, కొత్తగా ప్లాట్‌ఫారాల నిర్మాణం, కొత్త రైళ్లు, వందేభారత్‌ రైలు.. తదితరాలపై సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ ప్రజలంతా కోటి ఆశలు పెట్టుకున్నారు.

కొత్త ఆశలు
ఇటీవల దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన కొన్ని పనులతో ఇక్కడి ప్రజలో రైల్వే ప్రాజెక్టులపై ఆశలు చిగురించాయి. కాజీపేట– బల్లార్షా సెక్షన్, పెద్దపల్లి–కరీంనగర్‌–నిజామాబాద్‌ సెక్షన్‌లో వందేభారత్‌ కోసం ట్రాకులు సిద్ధం చేశారు. ట్రాకుల సామర్థ్యం పెంచడంతో 130 కి.మీ గరిష్ట వేగం నుంచి 90 కి.మీ కనిష్ట వేగంతో ఈ రూట్లలో రైళ్లు రాకపోకలు సాగించగలవు. ఇటీవల అమృత్‌ పథకం కింద కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం స్టేషన్లు ఎంపికయ్యాయి. ఈ పథకం కింద ప్రతీ స్టేషన్‌కు రూ.20 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు నిధులు రానున్నాయి.  మనోహరాబాద్‌– కొత్తపల్లి (కరీంనగర్‌) మార్గంలో సిరిసిల్ల– సిద్దిపేట పట్టణాలను కలుపుతూ సుమారు 30 కిలోమీటర్ల దూరం బ్రాడ్‌గేజ్‌ రైల్వేట్రాక్‌ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే బిడ్లు ఆహ్వానించింది. ఈ పనులకు రూ.440 కోట్ల మేరకు అంచనా వ్యయాన్ని కూడా రూపొందించింది.

కీలక డిమాండ్లు
నిజామాబాద్‌– పెద్దపల్లి మార్గం డబ్లింగ్‌ పనులకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌ ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉన్న తిరుపతి– కరీంనగర్‌ బైవీక్లీని ట్రై వీక్లీ లేదా డెయిలీ ఎక్స్‌ప్రెస్‌గా నడపాలి. సికింద్రాబాద్‌–కాజీపేట– బల్లార్షా సెక్షన్‌లో ఉత్తరభారతదేశానికి వందేభారత్‌ రైలును నడపాలి.

ప్రతిపాదనలు
- ఇదే సమయంలో ఈ ప్రాంతం అభివృద్ధికి కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఉదయం పూట కాజీపేట వరకు నడుస్తున్న 17036 ఎక్స్‌ప్రెస్‌ రైలును హైదరాబాదు వరకు పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
- ఉదయం పూట 17036 కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ తరువాత 17011 ఇంటర్‌ సిటీ ఎక్స్‌ ప్రెస్‌ మధ్యలో 7 గంటల గ్యాప్‌లో ఒక్కరైలు కూడా లేదు. ఈ సమయంలో సిర్పూర్‌ నుంచి కాజీపేట మార్గంలో ఒక రైలు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
- సింగరేణి మెమూ ఎక్స్‌ప్రెస్‌ రైలును సిర్పూర్‌టౌన్‌లో మధ్యాహ్నం 12:10కు బదులుగా ఉదయం 10 గంటలకే ప్రారంభించాలి. ప్ర తిపాదిత తెలంగాణ సంపర్క్‌ క్రాంతి సూ పర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుని హైదరాబాదు నుంచి ఢిల్లీ వయా నిజామాబాదు – కరీంనగర్‌ – పెద్దపల్లి మార్గంలో నడపాలి.
- బెలగావి నుంచి సికింద్రాబాద్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుని బల్లార్షా వరకు పొడిగించాలి. కాజీపేట నుంచి కొల్హాపూర్, సూరత్, పూణెలకి వీక్లీ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లను పెద్దపల్లి నుంచి నిజామాబాదు మార్గంలో నడపాలి. కాజీపేట నుంచి బాసరకు వయా పెద్దపల్లి– కరీంనగర్‌– నిజామాబాదు మీదుగా పుష్‌ పుల్‌ రైలు నడపాలి. కాజీపేట నుంచి ఆ దిలాబాద్‌ వయా పెద్దపల్లి– మంచిర్యాల– సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌–బల్లార్షా మీదుగా ఇంటర్‌ సిటీ ఎక్స్‌ ప్రెస్‌ రైలు ప్రారంభించాలి. 
- 2012లో 17011/12 ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు తరువాత కాజీపేట నుండి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ రైల్వే మార్గంలో మరో రైలు రాలేదు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య పెరిగినా.. కనీసం పుష్‌–పుల్‌ లేదా ఇంటర్‌సిటీ రైలు వేయాలన్న ఆలోచన ఇంతవరకూ చేయలేదు. ఈ మార్గం లో ఇప్పటికే 110 కిలోమీటర్ల మూడవ రైల్వే మార్గం అందుబాటులోకి వచ్చింది.
- ప్రస్తుతం విశాఖపట్నం నుంచి సాయినగర్‌ షిరిడీ మధ్య నడుస్తోన్న వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలుని కాజీపేట– సికింద్రాబాద్‌– నిజామాబాదు మార్గంలో బదులుగా దగ్గరి మార్గమైన కాజీపేటటౌన్‌– పెద్దపల్లి– నిజామాబాదు మార్గంలో దారి మళ్లించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మౌలికవసతుల కల్పన 
- కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌లో 2, 3 ప్లాట్‌ఫారం నిర్మించడం
- కరీంనగర్‌లో రైళ్ల నిర్వహణకు పిట్‌లైన్‌ ప్రతిపాదన
- లింగంపేట్‌ జగిత్యాల రైల్వే స్టేషన్‌లో 2ప్లాట్‌ఫారాలను 24 కోచ్‌ల రైలు పట్టేలా విస్తరణ చేయడం (ప్రస్తుతం 12 కోచ్‌లకి సరిపడా ఉంది)
- మల్యాల – కొండగట్టు రైల్వే స్టేషన్‌ని తిరిగి పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు
- పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో లిఫ్ట్‌ సౌకర్యం ఏర్పాటు, 4 వ ప్లాట్‌ ఫారం నిర్మించడం. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు