Wings India 2022: హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా 2022 ఏవియేషన్‌ షో

23 Mar, 2022 15:16 IST|Sakshi

గగుర్పొడిచే విన్యాసాలకు సారంగ్‌ టీమ్‌ సిద్ధం..

ఈ సారి జార్క్‌ జాఫ్రీ బృందం దూరం... 

పలు దేశాల నుంచి లోహ విహంగాల రాక.. 

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా దేశపు అతిపెద్ద ఏవియేషన్‌ షో... పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్టాత్మక దైవార్షిక ప్రదర్శన.. వింగ్స్‌ ఇండియా 2022 నగరంలో కొలువుదీరనుంది. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ ఆవరణలో మార్చి 24 నుంచి 4 రోజుల పాటు జరుగనున్న ఈ భారీ ఏవియేషన్‌ షో కోసం సర్వం సిద్ధమైంది. 

కరోనా కారణంగా గత మార్చిలో ఈ షోను కేవలం బిజినెస్‌ మీట్‌గా మాత్రమే పరిమితం చేశారు. రెండేళ్ల కోవిడ్‌ కాటు నుంచి కోలుకుంటూ... నగరంలో వింగ్స్‌ ఇండియా పూర్తి స్థాయిలో సందడి చేయనుంది ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు పాలు పంచుకుంటుండగా, నగరానికి చెందిన ఫెడరేషన్‌ ఆఫ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ) వింగ్స్‌ ఇండియా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. 

రాజకీయ/ పరిశ్రమ ప్రముఖుల హాజరు... 
ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభిస్తారు. మరో కేంద్రమంత్రి వికె సింగ్‌లు హాజరుకానున్నారు. చర్చలు.. సదస్సులు.. ఈ కార్యక్రమంలో హెలికాప్టర్‌ పరిశ్రమపై రౌండ్‌ టేబుల్‌ చర్చ జరుగనుంది. అదే విధంగా ఏవియేషన్‌ ఫైనాన్సింగ్‌– లీజింగ్‌ డ్రోన్స్, ఏవియేషన్‌ రివైవల్, ఏరో మాన్యుఫ్యాక్చరింగ్‌ భవిష్యత్తు, నిర్వహణ, మరమ్మతు, కార్యకలాపాలు తదితర అంశాలపై ప్యానెల్‌ చర్చ నిర్వహిస్తారు. సంబంధిత రంగంతో పాటు అనుబంధ రంగాలకు చెందిన పలు సంస్థలకు వింగ్స్‌ ఇండియా పురస్కారాలను మార్చి 25న ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం హోటల్‌ తాజ్‌కృష్ణాలో జరుగుతుంది. 

చివరి 2రోజులూ సందర్శకులకు... 
ఈ ఈవెంట్‌లో తొలి 2 రోజులూ వ్యాపార కార్యకలాపాల కోసం పరిమితం చేశారు. చివరి 2 రోజులూ సాధారణ ప్రజలను అనుమతిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించాలనుకునేవారు ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే టిక్కెట్స్‌ కొనుగోలు చేయడానికి వీలుంటుంది. (క్లిక్: ఆకాశంలో నడక.. అక్కడే టీ, కాఫీ, స్నాక్స్‌ )

విహంగాలు.. విశేషాలు.. 
ఈసారి ఎయిర్‌ షోలో సరికొత్త ఎయిర్‌ బస్‌ 350 సందడి చేయనుంది. సుదీర్ఘ ప్రయాణాలకు వీలుగా అందుబాటులోకి తెస్తున్న ఎయిర్‌ క్రాఫ్ట్‌ కావడంతో గత కొంతకాలంగా ఎయిర్‌ బస్‌ 350పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే విధంగా బ్రెజిల్‌ కు చెందిన ఎంబ్రార్స్‌ సంస్థ నుంచి అతిపెద్ద కమర్షియల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇ 195–ఇ2 కూడా ప్రదర్శనలో కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న డిమాన్‌స్ట్రేషన్‌ టూర్‌లో భాగంగా ఇది నగర వాసులకు పరిచయం కానుంది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కు చెందిన సారంగ్‌ టీమ్‌ ఆధ్వర్యంలో ఏరోబ్యాటిక్స్‌ షో సమర్పిస్తారు. (క్లిక్: జీహెచ్‌ఎంసీ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపులు ఎప్పటి నుంచి అంటే..)

మరిన్ని వార్తలు