ఫలించిన పరి‘శ్రమ’

6 Apr, 2022 02:40 IST|Sakshi

టీఎస్‌ఐపాస్‌ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులు

మహేశ్వరంలో విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ 

స్థానికులకే 90 శాతం జాబ్స్‌

ప్రేమ్‌జీ వినూత్నమైన వ్యాపారవేత్త అని కితాబు 

జీనోమ్‌ వ్యాలీలో ‘జాంప్‌ ఫార్మా’ ప్రారంభం 

మహేశ్వరం: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పరిశ్రమలు, కంపెనీల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం రాయితీలు, సౌకర్యాలు కల్పించి ప్రోత్సహిస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు చెప్పారు. కంపెనీలకు ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని కేసీ తండాలో ఎలక్ట్రానిక్‌ పార్కులో విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ పరిశ్రమను మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల పెట్టుబడితో విప్రో కంపెనీ పరిశ్రమను స్థాపించిం దని చెప్పారు. ‘ఇక్కడ 90 శాతం మంది స్థానికు లకు ఉపాధి కల్పిస్తాం. అందులో 15 శాతం మహిళలకు కేటాయిస్తాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌–ఐపాస్‌ ద్వారా 2.20 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చాం. 16 లక్షల మందికిపైగా ఉపాధి కల్పించాం. విప్రో లాంటి పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం అభినందనీయం’అని అన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు.

విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ వినూత్నమైన వ్యాపారవేత్త అని కేటీఆర్‌ కొనియాడారు. ప్రేమ్‌జీ కరోనా సమయంలో ఆరోగ్య సంరక్షణకు రూ.25 కోట్లు, టీకా కోసం రూ.12 కోట్లు, స్వచ్ఛంద సేవా సంస్థలకు మరో రూ.44 కోట్లు ఇచ్చారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ తీగల అనితారెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, రాష్ట్ర పరిశ్రమల ఎండీ నర్సింహారెడ్డి, జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్, విప్రో సీఈఓ వినీత్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

మహేశ్వరంలో మరిన్ని పరిశ్రమలు: సబితా 
మహేశ్వరం, రావిర్యాల, తుమ్మలూరు గేటు ప్రాం తాల్లో త్వరలో భారీ పరిశ్రమలు రానున్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి చెప్పారు. మరిన్ని ఐటీ, ఎలక్ట్రానిక్, ఇతర పరిశ్రమల రాకతో ఈ ప్రాం తం రూపురేఖలు మారిపోతాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌ వైపు చూసినప్పుడు.. హైదరాబాద్‌ నగరం వారికి కనిపిస్తోందని చెప్పారు.

హైదరా బాద్‌లో ఏర్పాటు చేసిన కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్థానికంగా సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ కంపెనీని సందర్శించి కంపెనీలో తయారైన వస్తువుల తయారీని పరిశీలించి, అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. కంపెనీ ఆవరణలో మొక్కలు నాటారు.  

జీనోమ్‌ వ్యాలీలో ‘జాంప్‌ ఫార్మా’ 
మర్కూక్‌: సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం కర్కపట్లలోని జీనోమ్‌ వ్యాలీలో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జాంప్‌ ఫార్మాను మంగళవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. జీనోమ్‌ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు. ప్రపంచ వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో 33శాతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. జీనోమ్‌ వ్యాలీని మరింత విస్తృత పరిచేలా మరో 400ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. జాంప్‌ ఫార్మా గ్రూప్‌ సీనియర్‌ వైస్‌ చైర్మన్‌ సుకంద్‌ జునేజా మాట్లాడుతూ కెనడా తర్వాత జీనోమ్‌ వ్యాలీలోనే అతిపెద్ద జాంప్‌ ఫార్మాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ను ప్రారంభిస్తున్న విప్రో చైర్మన్‌ అజీమ్‌ ప్రేమ్‌జీ, మంత్రులు కేటీఆర్, సబిత 

మరిన్ని వార్తలు