కరోనా పరిస్థితుల్లో పరీక్షలు లేకుండానే పాస్‌ మార్కులు 

6 May, 2021 19:59 IST|Sakshi

35% మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులైనా ప్రయోజనం శూన్యం 

గతేడాది సుమారు 45 వేల మంది విద్యార్థులకు పర్సంటేజీ ఇక్కట్లు 

ఇతర రాష్ట్రాల విద్యా సంస్థలు, ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీల్లో లభించని ప్రవేశాలు 

ఆయా సంస్థలు, వర్సిటీల్లో చేరేందుకు 45% కనీస అర్హత మార్కులు తప్పనిసరి 

ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం 

తల్లిదండ్రుల్లో ఆందోళన.. 45% మార్కుల కోసం డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్‌లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనతో వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. వీరంతా ఇంటర్‌లో పాసైనా ప్రయోజనం లేకుండాపోతోంది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీల్లోని డిగ్రీ, బీటెక్, బీ ఫార్మసీ, లా వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకుండా కనీస పాస్‌ మార్కులు 35 శాతం ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతోంది. గతేడాది రెగ్యులర్‌ ఇంటర్‌ పరీక్షలు నిర్వహించినా, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించలేదు. అలాగే ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో గతేడాది వేల మంది విద్యార్థులు నష్టపోగా, ఈసారి కూడా అదే ప్రమాదం పొంచి ఉండటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పాస్‌ చేస్తున్నప్పుడు కనీస మార్కులైన 45 శాతం వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

45% కావాలంటున్న ప్రైవేటు సంస్థలు 
ఇంటర్‌ తరువాత చదివే న్యాయ, వ్యవసాయ, వైద్య,, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే కనీసం 45 శాతం మార్కులు ఉండాలని దాదాపుగా అన్ని విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఆ నిబంధన తొలగించినా ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం కొనసాగిస్తున్నాయి. జేఈఈ వంటి పరీక్షలు రాసేందుకు, ఐఐటీల్లో చేరేందుకు 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కరోనా కారణంగా తొలగిస్తున్నట్లు గతేడాది కేంద్రం ప్రకటించింది. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు, డీమ్డ్, ప్రైవేట్‌ యూనివర్సిటీలు అందుకు ఒప్పుకోవడం లేదు. చివరకు రాష్ట్రంలోనూ ఎంసెట్‌ విషయంలో సమస్య తప్పలేదు. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మినహాయింపునిచ్చారు. కానీ న్యాయ, ఇతరత్రా వృత్తి విద్యా కోర్సుల్లో ఆ మినహాయింపు అమలు కాలేదు. దీంతో కనీస పాస్‌ మార్కులైన 35 శాతంతో ఉత్తీర్ణులైన ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులు, రెగ్యులర్‌ ఇంటర్మీడియట్‌లో 45 శాతం లోపు మార్కులు కలిగిన విద్యార్థులు ప్రవేశాలు పొందలేకపోయారు. ఇలా ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులు 30 వేల మంది, రెగ్యులర్‌ ఇంటర్మీడియట్‌లో మరో 15 వేల మంది నష్టపోవాల్సి వచ్చింది. 

మళ్లీ మొదలైన ఆందోళన.. 
ఈసారి ఇంటరీ్మడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. సెకండియర్‌ పరీక్షలు వాయిదా వేసింది. ఫస్టియర్‌ వారిని ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. వారికి మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినా ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. కరోనా వచ్చే రెండు మూడు నెలల్లో అదుపులోకి రాకపోతే ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండదు. అలాంటపుడు వారికి కనీస పాస్‌మార్కులే 35 శాతం ఇచ్చే అవకాశం ఉంది. గతేడాది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 1.47 లక్షల మందిని, గతేడాది వార్షిక పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నా, పరీక్షలకు హాజరు కాని 27 వేల మందిని 35 శాతం మార్కులతోనే పాస్‌ చేసింది. ఈసారి కూడా 4.5 లక్షల మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను, మరో 30 వేల మంది వరకు ఓపెన్‌ ఇంటర్‌ విద్యార్థులకు 35 శాతం మార్కులే ఇచ్చి పాస్‌ చేసే పరిస్థితి. అలా చేస్తే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. 

సెకండియర్‌లో కష్టపడాల్సిందే 
ఈసారి ఇంటర్మీడియట్‌ విద్యారి్థకి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 45 శాతం మార్కులు ఉండాలంటే ఆ విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 55 శాతానికి పైగా మార్కులు సాధించాల్సి ఉంటుంది. అప్పుడే ఆయా విద్యార్థులకు కనీస మార్కులైన 45 శాతం మార్కులు లభిస్తాయి. ఆ మేరకు రాకపోతే వచ్చే విద్యా సంవత్సరంలోనూ (2022–23) ప్రవేశాలకు విద్యార్థులు అనర్హులయ్యే ప్రమాదం ఉంది. అలాంటి వారు రాష్ట్రంలో లక్షన్నర మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఇక ఓపెన్‌ ఇంటర్‌ ఒక సంవత్సరమే కావడంతో ద్వితీయ సంవత్సరంలో ఎక్కువ మార్కులు తెచ్చుకొని సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా వీరికి లేదు. దీంతో అందరికీ 45 శాతం మార్కులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 

45 శాతం ఇస్తే చివరి విద్యార్థి వరకు మేలు 
అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనందున విద్యార్థులందరికీ ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్‌ మార్కులను బోర్డు కేటాయించింది. ఓపెన్‌ ఇంటర్‌ వారికి 35 శాతం మార్కులను ఇచ్చింది. దీనితో ఇతర రాష్ట్రాల్లో చేరాలనుకున్న విద్యార్థులకు నష్టం తప్పదు. ఇప్పుడు ప్రమోట్‌ చేసిన విద్యార్థులకు 45 శాతం ఇస్తే భవిష్యత్తులో వారికి నష్టం ఉండదు. 35 శాతంతో ఎలాగూ పాస్‌ చేస్తున్నప్పుడు 45 శాతం ఇస్తే పోయేదేమీ లేదు. పైగా విద్యార్థులందరికీ మేలు జరుగుతుంది.  – పి.మధుసూదన్‌రెడ్డి,  ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు

ఇంట‌ర్ మార్కులు, డిగ్రీ ప్ర‌వేశాలు, తెలంగాణ‌, ప్రైవేటు కాలేజీలు‌

మరిన్ని వార్తలు