నేనున్నానని...ఇంటి ఖర్చులను తగ్గించుకొని

30 May, 2021 11:29 IST|Sakshi

తోటివారికి సహాయ పడుతున్న గృహిణి

ఏడాదిగా సేవా కార్యక్రమాలు

స్ఫూరిదాయకంగా నిలుస్తున్న వీనస్‌మేరి 

అల్వాల్‌: అయినవారు ఆపదలో ఉన్నారని తెలిసినా కుంటి సాకులు చూపుతూ తప్పించుకుంటున్న ఈ విపత్కర సమయంలో ప్రార్థించే పెదవులకన్నా.. సహాయం చేసే చేతులే మిన్నా అంటూ అల్వాల్‌ సర్కిల్‌ వెంకటాపురానికి చెందిన ఓ గృహిణి గత 14 నెలలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది. స్టే హోం, స్టే స్టేఫ్‌ అని అందరూ అంటున్నప్పటికీ లాక్‌డౌన్‌ సమయంలో అందరు కుటుంబసభ్యులతో ఇంటికే పరిమితమైన సమయంలో తోటి వారికి సహాయం అందించాలన్న సంకల్పంతో తన నెలవారి ఇంటి ఖర్చులను తగ్గించుకొని ఇతరులకు సహాయం చేస్తుంది వెంకటాపురానికి చెందిన వీనస్‌మేరి క్లేబర్న్‌. భర్త షైన్‌ క్లేబర్న్‌ ఓ ప్రైవేట్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. భర్త సహకారంతో వీరికి వచ్చే ఆదాయంలో నుంచి అధిక భాగం సేవా కార్యక్రమాలకు వెచి్చస్తోంది. గత ఏడాది కరోనా ప్రారంభ దశలో శానిటైజర్లు, మార్కుల కొరత ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి ఇతరులకు పంపిణీ చేసింది.  

సేవా కార్యక్రమాలు..  
అనాథ శరణాలయాలకు నిత్యావసర వస్తువులు, గుడ్లు, బట్టలు అందించడంతోపాటు వృద్ధులకు, గుడిసెలలో నివసించే వారికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తూ తానే స్వయంగా ఇంట్లో వంట చేసుకొని ఆహారాన్ని ప్యాకెట్లు చేసి తన వాహనంపై తిరుగుతూ అన్నార్తులకు ఆహార ప్యాకెట్లను అందిస్తోంది. ఆలయాలు, ప్రార్థన మందిరాలు, చర్చిలకు శానిటైజర్లు, హైపో క్లోరైట్‌ ద్రావణాన్ని అందిస్తోంది. ఇబ్బందుల్లో ఉన్నవారికి వైద్య సహాయం చేస్తోంది.  

బాధ్యతగానే భావిస్తున్నా.. 
జీవితంలో ఎవరు ఊహించని విపత్కర సమయం ఏర్పడింది. ఈ తరుణంలో ఒకరికి ఒకరు సహాయం అందించుకోవడమే ఉత్తమం. ప్రభుత్వంపైనే ఆదార పడడం సరికాదు. ఎవరికి తోచిన సహాయం వారు చేయడం కనీస మానవత్వం. నా కుటంబసభ్యుల, శ్రేయోభిలాషుల సహకారంతో నాకు చేతనైనా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తునా. ఇది నాకు ఆత్మసంతృప్తి కలిగిస్తుంది. 
– వీనస్‌మేరి క్లేబర్న్, వెంకటాపురం

మరిన్ని వార్తలు