Mallanna Sagar: ముల్లె సర్దుకున్న.. ఎళ్లిపోతావున్న

18 Aug, 2021 08:27 IST|Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నర్సమ్మ. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టులో ఇల్లు, వ్యవసాయ భూమి కోల్పోయింది. కోల్పోయిన ఇంటికి అధికారులు పరిహారం అందించారు కానీ, సాగు భూమి 1.7 ఎకరాలకు సంబంధించిన పరిహారం అందించలేదు. దీంతో రాంపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీలోనే నివాసం ఉంటోంది. మంగళవారం అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఖాళీ చేసింది. ఊరిని వదిలిపెట్టి పోతున్నా అంటూ కన్నీటి పర్యంతం అయింది. ఆ భూమికి డబ్బులు ఇచ్చి మా కుటుంబాన్ని అదుకోవాలని అధికారులను  వేడుకుంది.

సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్‌ పనులు చివరి దశకు చేరడంతో ముంపు గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌లో 8 గ్రామ పంచాయతీలలో 16 గ్రామాలు ముంపు నకు గురవుతున్నాయి. ముంపు గ్రామాల్లో 5,618 కుటుంబాలు నివాస గృహాలు, భూమి కోల్పోతున్నట్లు గుర్తించారు. పరిహారం 90% వరకు అందించారు. ఒంటరి మహిళలు, పురు షులు, పలువురికి ఎలాంటి పరిహారం అందక పోవడంతో అక్కడే నివాసం ఉన్నారు.

కొముర వెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి త్వరలో నీటిని వదలనుండటంతో ముంపు గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్నారు. రెండు రోజు లుగా అధికారులు డీసీఎంలను పంపించి నివాసితులను మరోచోటకు పంపిస్తున్నారు. మంగళవారం 25 మంది నిర్వాసితులకు త్వరలో డబ్బులు అందజేస్తాం అని చెప్పి ఖాళీ చేయించారు. ఒక పక్కన గృహాలు ఖాళీ చేయిస్తూనే, మరో పక్క జేసీబీలతో ఇళ్లను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. మళ్లీ కలుసుకుంటామో లేదో అని రోదించారు. ఇంట్లోనుంచి వస్తూ గుమ్మాలను, గోడలను అప్యాయంగా తడుముకుంటూ వెళ్లడం అందరినీ కంటతడి పెట్టించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు