విషాదం: ఆస్పత్రికి చేరకుండానే...

13 Jun, 2021 10:44 IST|Sakshi
భార్య మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త  

జ్వరంతో ఉన్న మహిళ మార్గమధ్యలో మృతి 

భయంతో వదిలేసి వెళ్లిన ఆటోడ్రైవర్‌ 

రోడ్డుపక్కన భార్య మృతదేహంతో గుండెలవిసేలా రోదించిన భర్త  

హత్నూర(సంగారెడ్డి): జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళ తన భర్తతో కలసి ఆటోలో ఆసుపత్రికి వెళ్తూ మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది.  ఆటోడ్రైవర్‌ భయంతో రోడ్డుపైనే దించేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని ఆ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని రోడ్డు పక్కన పెట్టుకొని రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు... సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లక్మాతండాకు చెందిన మాలోత్‌ మరోని(50)కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భర్త పాండునాయక్‌ శనివారం ఆమెను దౌల్తాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

అక్కడ పరీక్షించిన వైద్యులు  సంగారెడ్డికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో దంపతులిద్దరూ ఆటో మాట్లాడుకుని సంగారెడ్డికి బయలుదేరారు. దారిమధ్యలో బోర్పట్ల బస్సు స్టేజీ సమీపంలోకి చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు గురైన మరోని ఆటోలోనే తనువు చాలించింది. దీంతో భయపడిన ఆటోడ్రైవర్‌ అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో తోచని పాండునాయక్, భార్య మృతదేహాన్ని రోడ్డు పక్కనే పడుకోబెట్టి కన్నీరు మున్నీరయ్యాడు.

అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు పాండును ఓదార్చడంతోపాటు తండావాసులకు సమాచారం ఇచ్చారు. తండావాసులు మరో వాహనం తీసుకువచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నాయక్‌ దంపతులకు నలుగురు కూతుళ్లు కాగా, అందరికీ వివాహాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
చదవండి:  పత్తి.. వరి.. కంది

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు