వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్‌ వికటించి మహిళ మృతి

3 Apr, 2021 08:03 IST|Sakshi
మృతురాలు నాగమణి(ఫైల్‌),ఆసుపత్రిలో బంధువుల ఆందోళన

మెడిసిస్‌ ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

సాక్షి, వనస్థలిపురం: వెన్నుపూసకు నిర్వహించిన ఆపరేషన్‌ వికటించి ఓ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం వనస్థలిపురం చింతలకుంటలోని మెడిసిస్‌ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ అప్పలమ్మగూడంకు చెందిన సిరసవాడ నాగేష్, నాగమణి (27) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగమణి కొంతకాలంగా నడుం, వెన్నునొప్పితో బాధపడుతోంది. ఆపరేషన్‌ నిమిత్తం బుధవారం చింతలకుంటలోని మెడిసిస్‌ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం సాయంత్రం ఆమెకు ఆపరేషన్‌ చేశారు. అనంతరం నాగమణి ఆరోగ్యం క్షీణించడంతో మధ్యరాత్రి ఆమె మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగమణి మృతి చెందిందని ఆపరేషన్‌ సమయంలో ఆసుపత్రిలో రక్తం నిల్వలు కూడా లేవని బంధువులు ఆరోపించారు. ఆపరేషన్‌ తర్వాత నాగమణికి కాళ్లు పని చేయక పోవచ్చు అని చెప్పిన వైద్యులు చివరకు ఆమె ప్రాణాలు తీశారని ఆమె భర్త నాగేష్‌ రోధిస్తూ తెలిపాడు. వైద్యులు హడావిడిగా ఆపరేషన్‌ చేసి ఆమె మృతికి కారణమయ్యారని బంధువులు పేర్కొన్నారు. ఆసుపత్రి వద్ద గొడవలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బీసీ నాయకులు బాధితుల తరపున ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వారికి నష్టపరిహారం అందేలా చేయడంతో గొడవ సద్దుమణిగింది. 

మా నిర్లక్ష్యం లేదు: ఆసుపత్రి నిర్వాహకులు 
నాగమణికి ఆపరేషన్‌ నిర్వహించిన తర్వాత సడెన్‌గా బీపీ డౌన్‌ అయ్యిందని, వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు మెరుగైన చికిత్సను అందించామని వైద్యులు వేణుగోపాల్‌ తదితరులు తెలిపారు. ఒకేసారి హార్ట్‌ మీద ప్రెషర్‌ పడటంతో ఆమె మృతి చెందిందన్నారు. చాలా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుందని వారు తెలిపారు. ఆమె ప్రాణాలు కాపాడడానికి తమ వంతు అన్ని ప్రయత్నాలు చేశామని తెలిపారు. ఇందులో తమ నిర్లక్ష్యం ఏమి లేదని వారు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు