ఆక్సిజన్‌ అందక.. ఊపిరి ఆగింది! 

24 Apr, 2021 01:14 IST|Sakshi
మృతిచెందిన అనిత కుమారి, కళ్యాణి (ఫైల్‌)

ఆరు ఆస్పత్రులకు తిరిగినా దొరకని ఆక్సిజన్‌..

అంబులెన్స్‌లోనే తుదిశ్వాస విడిచిన మహిళ 

వారం రోజుల కిందటే సోదరి మృతి  

సాక్షి, చిలకలగూడ: ఆక్సిజన్‌ అందక మహిళ మృతి చెందింది. ఆరు ఆస్పత్రులు తిరిగినా ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లోనే తుది శ్వాస విడిచింది. ఈ ఘటన సికింద్రాబాద్‌ సీతాఫల్‌మండిలో జరిగింది. సీతాఫల్‌మండి బ్రాహ్మణబస్తీకి చెందిన శేషాచార్యులు, పుష్పవల్లి దంపతులకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. మూడో కుమార్తె అనితకుమారి (48) భర్త వేణుగోపాల్‌తో కలసి బెంగళూర్‌లో నివసిస్తున్నారు. అనితకుమారి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించగా నెగెటివ్‌ వచ్చింది.

ఈనెల 21న కారులో బెంగళూర్‌ నుంచి తల్లి గారింటికి వచ్చింది. 22 సాయంత్రం శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి బయల్దేరారు. కమల ఆస్పత్రి, యశోద, ఓమ్ని, గ్లోబల్, నక్షత్ర ఆస్పత్రులకు వెళ్లగా, ఆక్సిజన్‌ కొరత ఉందని, పడకలు ఖాళీ లేవని అడ్మిట్‌ చేసుకోలేదు. ఎల్‌బీనగర్‌ సమీపంలోని ఓజోన్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే అనితకుమారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. 

వారం రోజుల క్రితమే సోదరి మృతి...  
అనితకుమారి సోదరి కల్యాణి (51) వారం రోజుల కింద ఇలాగే మృతి చెందడం గమనార్హం. మియాపూర్‌లో నివసిస్తున్న కల్యాణి ఈనెల 16న స్వల్ప అస్వస్థతకు గురైంది. కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చింది. సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. పలు ఆస్పత్రులకు తిరిగినా బెడ్లు ఖాళీ లేవని చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువెళ్లారు. అదే రోజు రాత్రి కల్యాణి మృతి చెందింది. వారం రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో బ్రాహ్మణబస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి ఇద్దరి మృతికి ప్రభుత్వ వైఫల్యాలే కారణమని మృతుల సోదరులు విజయసారథి, వేణుగోపాల్‌ ఆరోపించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు