ఎట్ల బతుకుతరు బిడ్డా.. దేవుడా ఎంత పనిచేసినవ్‌.. 

1 Apr, 2023 08:27 IST|Sakshi

అప్పుడు నాన్న..ఇప్పుడు అమ్మను తీసుకుపోయిండు

ఆగమైపోతిరి కదా బిడ్డా

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు దుర్మరణం 

స్కూటీపై వెళ్తుండగా ఢీకొట్టిన రెడీమిక్స్‌ వెహికల్‌

పైనుంచి లారీ వెళ్లడంతో నుజ్జునుజ్జయిన శరీరం

ఏడేళ్లక్రితం గుండెపోటుతో భర్త మృతి

తల్లి మృతితో అనాథలైన ఇద్దరు పిల్లలు

‘‘పాపపు దేవుడు పగ పట్టిండు బిడ్డా.. అప్పుడు నాన్నను తీసుకుపోయిండు.. ఇప్పుడు అమ్మను కూడా తీసుకుపోయిండు.. ఏం పాపం చేస్తిరిబిడ్డ మీరు.. ఎక్కడ కాకుండా అయిర్రు.. నాన్న పోయినంక అమ్మ కళ్లల్ల పెట్టి సాదుకుంది బిడ్డలారా.. అమ్మ కూడా పోయింది.. ఇప్పుడు ఎట్లా బిడ్డలారా.. అంటూ మృతి చెందిన టీచర్‌ రజిత కొడుకులను పట్టుకొని బంధువులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.’’

సాక్షి, కరీంనగర్‌: పిల్లలకు ఊహ తెలియని వయసులో తండ్రి గుండెపోటుతో దూరమయ్యాడు. అప్పటి నుంచి ఆ తల్లే అన్నీ తానై చూసుకుంటోంది. ఇద్దరు పిల్లలకు కన్నప్రేమ పంచుతూనే కుటుంబ బాధ్యతను మోస్తోంది. పిల్లలే ప్రాణంగా బతుకుతూ.. టీచింగ్‌ చేస్తోంది. రోజూ మాదిరిగానే పిల్లలను పాఠశాలకు సిద్ధం చేసి విధులకు బయల్దేరిన ఆమెను మృత్యువు కబళించింది. రెడీమిక్స్‌ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. తలకు హెల్మెట్‌ పెట్టుకున్నా.. శరీరం పైనుంచి వాహనం వెళ్లడంతో బాడీ ముక్కలుముక్కలైంది. చెల్లా చెదురుగా పడిఉన్న శరీరభాగాలను ఒక్కచోటుకి చేర్చి ఆస్పత్రికి తరలించిన దృశ్యం ఘటనాస్థలంలో పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో కరీంనగర్‌లోని పద్మనగర్‌ బైపాస్‌ రోడ్డు చౌరస్తా వద్ద చోటు చేసుకుంది.

అంతా క్షణాల్లోనే..
కరీంనగర్‌లోని అలకాపురిలో నివాసం ఉంటున్న బైరెడ్డి రజిత (41) ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2014లో మోడల్‌సూ్కల్‌లో మ్యాథ్స్‌ పీజీటీగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఇల్లంతకుంట (రహీంఖాన్‌ పేట్‌) మోడల్‌ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు స్కూల్‌కు సహోద్యోగులు, ఆ ప్రాంతంలో పనిచేసే మరికొందరు టీచర్లతో కలిసి ఆటోలో కరీంనగర్‌ నుంచి ఇల్లంతకుంటకు వెళ్తుండేవారు. అలకాపురి నుంచి స్కూటీపై వచ్చి పద్మనగర్‌ చౌరస్తాలోని ఓ పాఠశాల వద్ద పార్కింగ్‌ చేసి ఆటోలో సహోద్యోగులతో వెళ్తుంటారు. గురువారం ఉదయం 6.45 తరువాత ఇంట్లో పిల్లలను పాఠశాలకు సిద్ధం చేసి తన స్కూటీపై బయల్దేరారు. పద్మనగర్‌ బైపాస్‌ చౌరస్తా వద్దకు చేరుకొని, పక్కనే ఉన్న ప్రయివేటు పాఠశాలలో వాహనాన్ని పార్క్‌ చేసేందుకు యూటర్న్‌ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో సిరిసిల్ల వైపు నుంచి మానేరుడ్యాం వైపు రోడ్డు క్రాస్‌ చేస్తున్న రెడీమిక్స్‌ లారీ (టీఎస్‌02 యూబీ 7183) అతివేగంగా స్కూటీని ఢీకొట్టింది. దీంతో రజిత కిందపడగా ఆమె శరీరం పైనుంచి లారీ వెళ్లింది. శరీరం నుజ్జునుజ్జయి.. అక్కడికక్కడే చనిపోయారు. 

నాడు తండ్రి.. నేడు తల్లి..
రజితకు శంకరపట్నం మండలం గద్దపాకకు చెందిన బైరెడ్డి తిరుపతిరెడ్డితో వివాహం కాగా ఇద్దరు కొడుకులు ప్రజ్ఞాత్‌రెడ్డి(14), రిశిఖ్‌రెడ్డి(10) ఉన్నారు. తిరుపతిరెడ్డి కరీంనగర్‌ కోర్టులో న్యాయవాదిగా పనిచేసేవారు. ఆరేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. అప్పటి నుంచి రజిత కరీంనగర్‌లోని అలకాపురిలో తన తల్లిగారింట్లో పిల్లలతో ఉంటున్నారు. పిల్లలను ప్రయివేటు పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కొడుకు పదో తరగతి, చిన్న కొడుకు ఆరో తరగతి చదువుతున్నారు. తండ్రి లేకపోయినా తన కొడుకులను ప్రేమగా చూసుకుంటున్న తల్లిని రోడ్డు ప్రమాదంలో రూపంలో విధి బలితీసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

మమ్మి.. మాకు బాయ్‌ చెప్పి వెళ్లింది
‘మమ్మి.. మాకు బాయ్‌ చెప్పి వెళ్లింది. మళ్లీ ఎటు వెళ్తున్నామని’ మనవళ్లు అడిగిన ప్రశ్నకు రజిత తల్లిదండ్రులు సమాధానం చెప్పలేకపోయారు. సరిగ్గా ఏడు గంటలకు ప్రమాదం జరగడంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పటివరకు పాఠశాలకు వెళ్లిందనుకున్న తమ కూతురు మరణించిందన్న వార్త తెలియడంతో గుండెలవిసేలా రోదించారు. రజిత మరణవార్త వినగానే బంధువులు, టీచర్లు వందలసంఖ్యలో జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. చివరిచూపునకు కూడా నోచుకోని మృతదేహం వద్ద గుండెలవిసేలా విలపించారు. రజిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అలకాపురిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతురాలు తండ్రి బండ నర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు