కాటికాపరి ఒకరు.. పాఠాలు చెప్పే అవ్వ మరొకరు!

8 Mar, 2021 08:45 IST|Sakshi

ఘనాపాఠి.. కాటికాపరి

అంతిమసేవలో ‘అరుణ’ కిరణం ఒకరు

డెబ్బై ఏళ్ల వయసులోనూ పాఠాలు చెబుతూ మరొకరు

ఒకరు అంగన్‌వాడి టీచర్‌.. ఇందులో ప్రత్యేకతేమిటంటారా? ఏడు పదుల వయసులోనూ ఈమె చెప్పే పాఠాలు వినడానికి పిల్లలు చెవికోసుకుంటారు. ఇక మరొకరు.. అరుణ. కాటికాపరి. శ్మశానమంటేనే భయపడే పరిస్థితుల్లో.. ఆమె మాత్రం మృతదేహానికి అంతిమ సంస్కారాల దగ్గరి నుంచి దహనం అయ్యే వరకు ఒంటిచేత్తో పనులు చక్కబెడుతుంది. ప్రత్యేకించి అనాథ శవాలకు ఆమె ఆత్మబంధువు.

భద్రాచలం: శవం, శ్మశానం.. ఈ పేర్లు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.. ఆ చోటునే తన జీవనాధారంగా చేసుకున్న కథ అరుణది. అనాథ శవాలకు, కోవిడ్‌ మృతులకు అన్నీ తానై అంతిమ సంస్కారాలను నిర్వహించిన ‘సంస్కారం’ ఆమెది. కాటికాపరిగా ఓ మహిళ.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అరుణ నిజం చేసి చూపిస్తోంది. భద్రాచలానికి చెందిన ముత్యాల అరుణకు రాజమండ్రికి చెందిన శ్రీనివాస్‌తో 12 ఏళ్లప్పుడే పెళ్లయింది. 16 ఏళ్లొచ్చేసరికి ఇద్దరు కుమారులు జన్మించారు. శ్రీనివాస్‌ భద్రాచలంలోని వైకుంఠఘాట్‌లో పనిచేస్తూ, అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందాడు.

దీంతో అరుణ జీవితంలో అంధకారం.. ఏం చేయాలో తెలియని స్థితిలో గుండె ధైర్యం తెచ్చుకుని భర్త చనిపోయిన 16 రోజులకే శ్మశానవాటికలో అడుగుపెట్టింది. కాటికాపరిగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత తీసుకుంది. అంత్యక్రియలకు కట్టెలు తదితర సామగ్రి, ఇతర ఖర్చుల నిమిత్తం మృతుడి కుటుంబసభ్యులు ఎంతో కొంత ఇస్తారు. కానీ అనాథ శవాలకు ఎవరూ చిల్లిగవ్వ ఇవ్వరు. అయినా అనాథ శవాలకు అన్నీ తానే అయి అంత్యక్రియలు నిర్వహిస్తోందీమె. రూ.7,500 జీతమే తన జీవనాధారమని చెబుతోంది.  అయినవారెవరూ కడచూపునకు రాకున్నా.. 15 మంది కరోనా మృతుల ఖనన కార్యక్రమాలను నిర్వహించింది అరుణ. వీరి అస్థికలను  తానే గోదావరిలో కలిపింది.

అవ్వ చెప్పే పాఠం.. ఎంతో ఇష్టం
ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): భూలక్ష్మికి 70 ఏళ్లు. అంగన్‌వాడీ టీచర్‌గా ఇప్పటికీ చురుకుగా సేవలందిస్తున్నారు. పిల్లలకు తనదైన శైలిలో బోధిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా అవార్డులూ పొందారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఈమె 1989 ఫిబ్రవరిలో అంగన్‌వాడీ కార్యకర్తగా విధుల్లో చేరారు. 32 ఏళ్లుగా నగరంలోని పూసలగల్లిలో అంగన్‌వాడీ టీచర్‌గా సేవలందిస్తున్నారు. చిన్నారులకు ఆట పాటలతో విద్యనందిస్తున్నారు. తనదైన శైలిలో చిన్నారులకు ప్రీస్కూల్‌ పాఠాలు చెబుతున్నారు.

దీంతో ఈ కేంద్రంలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతుంటారు. కేంద్రంలో ఎప్పుడూ 20–30 మంది చిన్నారులు ఉంటారు. వయసు మీదపడినా.. ఆమె విధి నిర్వహణలో మాత్రం ఆ ఛాయలే కనిపించవు. దీంతో ఆమె పనితనానికి మెచ్చిన ఐసీడీఎస్‌ అధికారులు 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు అందించారు. చిన్నచిన్న బోధనోపకరణాలను ఉపయోగించి పిల్లలకు పూసగుచ్చినట్టు చెప్పడం, వారి వయసుకు తగ్గ రీతిలో బోధనాంశాలను మలచడం భూలక్ష్మి ప్రత్యేకత.

మరిన్ని వార్తలు