ఉమెన్స్‌ డే స్పేషల్‌!...స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా మహిళలకు పట్టం

8 Mar, 2022 07:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమెన్స్‌ డే నేపథ్యంలో ఏటా నగర పోలీసు విభాగం వివిధ రకాల కార్యక్రమాల నిర్వహిస్తూ వస్తోంది. ప్రస్తుత కొత్తాల్‌ సీవీ ఆనంద్‌ దీనికి భిన్నంగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీ పోలీసు విభాగంలో ఓ మహిళ ఇన్‌స్పెక్టర్‌ను శాంతిభద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) నియమిస్తున్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ, కొత్వాల్‌ ఆనంద్‌ సమక్షంలో లాలాగూడా ఎస్‌హెచ్‌ఓగా సదరు అధికారిణి బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఒకప్పుడు పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది, అధికారిణిల సంఖ్య తక్కువగా ఉండేది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కేటాయించారు. దీంతో నానాటికీ వీరి సంఖ్య పెరుగుతోంది. అదనపు డీజీ నుంచి  కానిస్టేబుళ్ల వరకు కలిపి ప్రస్తుతం 3803 మంది ఉన్నారు. హోంగార్డులు వీరికి అదనం. ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో ఉన్న వారి సంఖ్యే 31గా ఉంది. అయితే వీరిలో ఏ ఒక్కరూ శాంతిభద్రతల విభాగం ఠాణాకు ఎస్‌హెచ్‌ఓగా లేరు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటి వరకు ఇలాంటి నియామకం జరగలేదు.

అటవీ, ఎక్సైజ్, ఆర్టీఏ, రెవెన్యూల్లో మహిళలను దీనికి సమానమైన హోదాల్లో నియమిస్తున్నా... పోలీసుల్లో మాత్రం జరగలేదు. కేవలం మహిళ ఠాణాలు, ఉమెన్‌ సేఫ్టీ, భరోస, లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ వంటి వాటికే మహిళలు నేతృత్వం వహిస్తున్నారు. ఇది వారిలో ఆత్మన్యూనతా భావానికి కారణం అవుతోందని, ఫలితంగా ప్రతిభ ఉన్న వారికీ తమ పనితీరు ప్రదర్శించే అవకాశం ఉండట్లేదని సీపీ భావించారు. ఒక మహిళకు ఎస్‌హెచ్‌ఓగా అవకాశం ఇస్తే ఆ స్ఫూర్తితో ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌లో ఉన్న, భవిష్యత్‌లో అడుగుపెట్టనున్న వాళ్లూ సమర్థవంతంగా పని చేస్తారని భావించారు. దీంతో ఉమెన్స్‌డే నేపథ్యంలో నగరంలోని ఓ పోలీసుస్టేషన్‌కు మహిళను ఎస్‌హెచ్‌ఓగా నియమిస్తున్నారు.

దీనికి సంబంధించి కమిషనరేట్‌ అధికారులు దాదాపు రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. నగరంలో ఉన్న ఉమెన్‌ ఇన్‌స్పెక్టర్ల ప్రొఫైల్, వారు గతంలో పని చేసిన ప్రాంతాల్లో, పోస్టులు, సామర్థ్యం తదితరాలను తెలుసుకున్నారు. దాదాపు ప్రతి అధికారిణినీ కమిషనరేట్‌కు పిలిచిన అధికారులు శాంతిభద్రతల విభాగంలో ఉండే సవాళ్లు, వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన సమర్థత తదితరాలను వివరించారు. ఈ కసరత్తు తర్వాత మహిళ ఇన్‌స్పెక్టర్‌ను ఎంపిక చేశారు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. మహిళ అధికారిణుల ప్రతిభ ఆధారంగా ఎస్‌హెచ్‌ఓల్లోనూ 33 శాతం వీరే ఉండేలా ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

(చదవండి: గోల్డెన్‌...ఫైట్‌)

మరిన్ని వార్తలు