కలహాలతో విసిగి.. పిల్లలతో కలిసి చెరువులో దూకి..!

25 Sep, 2022 03:56 IST|Sakshi

ఘటనలో తల్లి, కవల పిల్లలు గల్లంతు... ప్రాణాలతో బయటపడిన పెద్ద కుమార్తె

నవాబుపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి.. తన ముగ్గురు పిల్లలతో చెరువులోకి దూకింది. ఈ సంఘటనలో కవల పిల్లలతో సహా తల్లి గల్లంతు కాగా.. మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలం పరిధిలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. కాకర్లపహాడ్‌కు చెందిన అద్దాల మైబు, రమాదేవి (35)కి దాదాపు 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు నవ్య, కవల పిల్లలు చందన (4), మారుతి (4) ఉన్నారు. భార్యభర్తలు హైదరాబాద్‌లోనే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

శనివారం భార్య రమాదేవి.. కవల పిల్లలు చందన, మారుతిలతో కలిసి హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌కు వచ్చింది. అక్కడి నుంచి దేవరకద్ర కేజీబీవీలో ఆరో తరగతి చదువుకుంటున్న నవ్యను తీసుకొని నవాబ్‌పేట బస్సులో స్వగ్రామానికి బయల్దేరింది. కాగా కాకర్లపహాడ్‌ సమీపంలోనే బస్సు దిగి గ్రామానికి నల్లకుంట చెరువు మీదుగా వెళ్దామని ముగ్గురు పిల్లలకు చెప్పి.. నడుచుకుంటూ తీసుకెళ్లింది.

అయితే చెరువు సమీపంలోకి వెళ్లిన తర్వాత పిల్లలు భయపడడంతో.. వారిని గట్టిగా పట్టుకుని నీటిలోకి వెళ్లింది. పెద్ద కూతురు నవ్య గట్టిగా అరుస్తూ.. చెల్లిని బయటకు లాగే ప్రయత్నం చేసినా.. తల్లి రమాదేవి ఇద్దరు కవల పిల్లలతో నీటిలోకి వెళ్లడంతో వారు ముగ్గురు మునిగిపోయారు. నవ్య నీటిలోని ఓ చెట్టుకొమ్మను పట్టుకుని ఒడ్డుకు చేరుకొని ప్రాణాలతో బయటపడింది. ఆ చిన్నారి రోడ్డుపైకి వచ్చి అటు వైపు వెళ్తున్న గ్రామస్తులకు విషయం చెప్పడంతో బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి గాలింపు చర్యలు  చేపట్టినా.. వారి ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం మరోసారి గాలిస్తామని ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. భర్తతో గొడవ పడి ఇలాంటి నిర్ణయం తీసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు