పట్టింపులకు ..‘కత్తెర’

7 Mar, 2022 04:27 IST|Sakshi
కటింగ్‌ చేస్తున్న లావణ్య

హెయిర్‌ కటింగ్‌ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న లావణ్య

భర్తకు తోడుగా సెలూన్‌లో కులవృత్తి

సాక్షి, సిద్దిపేట:  ఒకప్పుడు మహిళలు అంటే ఇంటికే అంకితమనేవారు. తర్వాత కాలం మారినా.. కొన్ని రకాల ఉద్యోగాలు, కొన్ని రంగాలకే పరిమితమయ్యారు. కొన్ని రకాల కుల వృత్తులు అయితే పూర్తిగా పురుషులే ఉండే పరిస్థితి. ఇలాంటి ఆలోచనల్లో మార్పు తెస్తోంది సిద్దిపేటకు చెందిన కొత్వాల్‌ లావణ్య. పట్టింపులన్నీ పక్కన పెట్టి.. విజయవంతంగా క్షౌరవృత్తిని నిర్వహిస్తోంది. అటు భర్తకు చేదోడుగా ఉండటంతోపాటు కుటుంబానికి ఆసరానూ ఇస్తోంది. 

ఆర్థిక ఇబ్బందులతో..  
సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కొత్వాల్‌ లావణ్య, నంగనూరు మండలం దేవుని నర్మెట గ్రామానికి చెందిన శ్రీనివాస్‌లకు 13 ఏళ్ల కింద వివాహమైంది. మొదట్లో వారు వ్యవసాయం చేసేవారు. అది గిట్టుబాటు కాకపోవడంతో పనికోసం 8 ఏళ్ల కింద సిద్దిపేటకు వచ్చారు. పట్టణంలో పలు సెలూన్లలో శ్రీనివాస్‌ రోజువారీ పనికివెళితే.. లావణ్య కూలీపనులకు వెళ్లేది.

ఇన్నాళ్లూ ఎలాగోలా గడిచినా.. కరోనా సమయంలో సెలూన్లు మూతపడటం, గిరాకీ తగ్గడంతో శ్రీనివాస్‌కు పనిలేకుండా పోయింది. ఇద్దరూ కూలిపనులకు వెళ్లినా వచ్చే అరకొర సంపాదన సరిపోక అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలోనే భర్తతో కలిసి తానూ కత్తెర పట్టాలనుకుంది. ఆ ఆలోచనకు శ్రీనివాస్‌ అండగా నిలిచాడు. 4 నెలల పాటు వివిధ స్టయిళ్లలో కటింగ్‌ చేయడం నేర్చుకుంది లావణ్య. ఇద్దరూ కలిసి గతేడాది నవంబర్‌ 25న స్థానిక కేసీఆర్‌ నగర్‌ (డబుల్‌ బెడ్రూమ్‌ కాలనీ)లో హరీశన్న హెయిర్‌ కటింగ్‌ పేరుతో సెలూన్‌ ప్రారంభించారు.

లావణ్య రోజూ ఇంటిపనులు చూసుకోవడంతోపాటు.. పొద్దంతా షాప్‌లో కటింగ్‌ చేస్తోంది. ముఖ్యంగా కటింగ్‌కు వచ్చే పిల్లలు ఏడుస్తుంటారు. లావణ్య వారిని బుజ్జగిస్తూ, కబుర్లు చెప్తూ కటింగ్‌ చేస్తుండటం అందరినీ ఆకట్టుకుంది. చాలా మంది తమ చిన్నారులను హెయిర్‌ కటింగ్‌ కోసం లావణ్య వద్దకు తీసుకురావడం మొదలుపెట్టారు. 

మా ఆయన దగ్గరే ట్రైనింగ్‌ తీసుకున్నా 
మా కులంలో మగవాళ్లు చాలావరకు కులవృత్తిలోనే కొనసాగుతున్నారు. మా కుటుంబంలో ఆడవాళ్లు ఎవరూ కటింగ్‌ షాప్‌లో అడుగు పెట్టలేదు. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల మా ఆయనకు సపోర్ట్‌గా నిలవాలనుకున్నా. కటింగ్‌ చేస్తానంటే మా ఆయన సపోర్ట్‌ చేశారు. ఆయన దగ్గరే ట్రైనింగ్‌ తీసుకున్నా. ఎవరేమైనా అనుకోనీ అని క్షౌరవృత్తి మొదలుపెట్టిన. పిల్లలు, పెద్దలు ఎవరికైనా కటింగ్, షేవింగ్‌ చేస్తున్నా. మా ఆర్థిక ఇబ్బందులకు కొంత పరిష్కారం దొరికింది.     
– లావణ్య

మరిన్ని వార్తలు