భూ సమస్య పరిష్కరించడం లేదని మహిళ ఆత్మహత్యాయత్నం

1 Nov, 2022 01:40 IST|Sakshi
ఆత్మహత్యాయత్నం చేసిన సరిత 

నర్సింహులపేట: భూ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని, పరిష్కరించడం లేదని ఓ మహిళ ఆత్మ హత్యాయత్నం చేసింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేటలో జరిగింది. బాధితురాలు సుంకరి సరిత తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన సుంకరి వెంకనర్సు, కిష్టమ్మలకు కుమారులు సుంకరి లక్ష్మయ్య, నారాయణ, భద్రయ్య, సోమయ్య, సాంబయ్య.

వీరికి గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 1127, 1128, 1129లో 2.10 ఎకరాల భూమి ఉంది. వాటాల ప్రకారం సుంకరి భద్రయ్య, వెంకటమ్మలకు రావాల్సిన 20 గుంటల భూమిని సుంకరి సుధాకర్, సుంకరి సాంబయ్యలు 10 గుంటల చొప్పున తెలియకుండా రికార్డుల్లో ఎక్కించుకున్నారు. తన తల్లిదండ్రుల భూమిని తన పేరుమీదకు మార్చుకోవాలని సరిత ఏడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతోంది. పట్టించుకోకపోవడంతో విసుగుచెందిన ఆమె.. సోమవారం కార్యాల యానికి వచ్చి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. అక్కడే ఉన్న సిబ్బంది అమెను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఎస్సై మంగీలాల్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, తహసీల్దార్‌ వివేక్‌తో కలిసి భూ సమస్యపై సరితతో మాట్లాడారు. తన తల్లిదండ్రులకు ఒక్కతే కుమార్తెనని, వారు చనిపోవడంతో, ఆ భూమిని తమ పేర ఎక్కించాలని మొరపెట్టుకుంటున్నా వినడం లేదని సరిత తెలిపింది. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా, ఈ సమస్య కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు