న్యాయమడిగితే కుల బహిష్కరణ

9 Sep, 2020 10:51 IST|Sakshi
బాధితురాలు రెడ్డి సునీత

సాక్షి, మోపాల్‌: న్యాయం చేయాలని కులపెద్దలను అడిగితే ఏకంగా కులబహిష్కరణ చేశారని నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని గుండారం గ్రామానికి చెందిన రెడ్డిసునీత ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆర్డీవో, ఏసీపీలకు వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో తమకు ఉన్న వ్యవసాయ భూమిని బావ మల్లారెడ్డి కబ్జా చేస్తున్నాడని గతంలో పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయం ఆయనపై కేసు నమోదైందన్నారు. అయినప్పటికీ మళ్లీ గొడవ చేయడంతో మండల సర్వేయర్‌తో సర్వే చేయించి హద్దుల ప్రకారం కంచె వేసుకున్నామన్నారు. తాజాగా తిరిగి అదే హద్దుల విషయంలో ప్రత్యర్థులు కులపెద్దలను ఆశ్రయించి మా కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు.

దేవాలయానికి సంబంధించిన భూమిని మాకు కట్టబెట్టి మా పట్టాభూమిని వారికి ఇవ్వాలని ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని దీనికి ఒప్పుకోకపోవడంతో కులపెద్దలకు చెప్పి తమను బహిష్కరించారని తెలిపారు. అంతేకాకుండా కులపెద్దలు మా కుటుంబసభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరిస్తున్నారన్నారు. తమతో ఎవరైన మాట్లాడితే రూ.5వేలు జరిమానా విధిస్తామని సంఘంలో తీర్మానం చేశారని ఆరోపించారు. వెంటనే అధికారులు జోక్యం చేసుకొని తమకు రక్షణ కల్పించాలని మా భూమిని మాకు అందించి న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.

>
మరిన్ని వార్తలు