సర్పంచ్‌ నవ్యపై వేధింపులతో మరోసారి తెరపైకి

13 Mar, 2023 16:53 IST|Sakshi

వరంగల్: మహిళా సర్పంచ్‌పై లైగింక వేధింపుల ఆరోపణలతో ఎమ్మెల్యే రాజయ్య వ్యవహారం మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే సార్‌ను ఓ ఆటా ఆడేసుకుంటున్నారు. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న ఎమ్మెల్యే.. మహిళలకు సంబంధించి తరుచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఎమ్మెల్యే రాజయ్య తనను లైగింకంగా వేధిస్తున్నాడని హనుమకొండ/జనగామ జిల్లా పరిధి స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం ధర్మసాగర్‌ మండలం జానకీపురం సర్పంచ్‌ కుర్చపల్లి నవ్య ఆరోపించడంతో మూడు రోజులుగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీతో సహా అన్ని వర్గాల నుంచి ఆగ్రహం పెల్లుబికడంతో నిరసన సెగ ప్రగతిభన్‌ను తాకింది. పార్టీ వర్గాలు ఓపైపు ఆరా తీస్తుండగానే.. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించింది.  

ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదమే..!
గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే రాజయ్య మహిళలకు సంబంధించిన ఏదో ఒక వివాదంలో తెరపైన కనిపిసూ్తనే ఉన్నాడు. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనను కేబినెట్‌ నుంచి ఏకంగా బర్తరఫ్‌ చేయడం అప్పట్లో హాట్‌టాఫిక్‌గా మారింది. దానిపై అనేక ముచ్చట్లు సైతం వినిపించాయి. ఇదిలా ఉంటే.. గతంలో వేలేరు మండలంలోని ఓ ఊరికి చెందిన మహిళతో ఫోన్‌లో అసభ్యకరంగా.. శవ్వ, శవ్వ అంటూ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడిన మాటలుగా.. ఆడియో రికార్డు ఆ రోజుల్లో పెద్ద చర్చనీయాంశం కాగా.. అది తన వాయిస్‌ కాదని రాజయ్య కొట్టిపారేశారు. 

ఆ తర్వాత లింగాలఘణపురంలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో సైతం ఎమ్మెల్యే చిలిపి చేష్టలు.. ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేశాయి. ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లాలో లక్ష మందికి పైగా పిల్లలు తన వల్లనే పు ట్టారని వివాదాస్పద వ్యాఖ్యలు సైతం విమర్శలను ఎదుర్కొనేలా చేసింది. అలాగే లింగాలఘణపురం మండలంలో బతుకమ్మ చీరల పంపిణీలో సీఎం కేసీఆర్‌ అందరికీ భర్త లాంటి వాడని నోరుజారీ.. సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా జానకీపురం సర్పంచ్‌ నవ్య ఎమ్మెల్యే తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించడంతో ఎమ్మెల్యేకు అధిష్టానం నుంచి మొట్టికాయలు వేసే వరకు దారి తీసింది.   

మహిళా కమిషన్‌ ఆదేశం..పోలీసుల విచారణ
ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని సర్పంచ్‌ నవ్య ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌çపర్సన్‌ సునీత స్పందించారు. కేసును సుమోటోగా తీసుకుని.. విచారణకు డీజీపీని ఆదేశించారు. దీంతో పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రహించిన ఎమ్మెల్యే.. పార్టీ పెద్దల సూచనలు పాటిస్తూ.. ఆదివారం జానకీపురంలోని సర్పంచ్‌ నవ్య ఇంటికి వెళ్లారు. సర్పంచ్‌ దంపతులతో కలిసి ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు. ప్రొటోకాల్‌ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది కలిగితే.. మహిళా లోకం తనను క్షమించాలని కోరగా.. నవ్య పార్టీ ఆదేశాల మేరకు నడుచుకుంటానని చెబుతూనే.. ఎమ్మెల్యేకు పరోక్షంగా హెచ్చరికలను జారీ చేసింది. వేధింపులకు గురిచేసిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్యే సర్పంచ్‌ ఇంటికి వెళ్లడంతో నాలుగు రోజుల వివాదానికి తెరపడగా.. మహిళా కమిషన్‌ విచారణకు ఎమ్మెల్యే హాజరు కావాల్సి ఉంటుందా లేదా అనే విషయం తేలాల్సి ఉంది. ఇందుకు సంబంధించి సర్పంచ్‌ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యవహారంపై ఇంటలిజన్స్‌ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు సమాచారం. ఈ విషయమై సీఎంతోపాటు మంత్రి కేటీఆర్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు