వివాదంలో ఎమ్మెల్యే.. వేధిస్తున్నారని ఫిర్యాదు

25 Sep, 2020 08:55 IST|Sakshi

ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌ : మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు భూ కబ్జాలను అడ్డుకున్నందుకు తన కుటుంబ సభ్యులపై కేసులు బనా యించి వేధిస్తున్నారని మిర్యాలగూడ పట్టణానికి చెందిన బంటు మణెమ్మ గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మిర్యాలగూడటౌన్‌ పోలీసులు కుమ్ముక్కై తమను వేధిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే, పోలీసుల నుంచి తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నామని, ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నామని వివరించారు. ఎమ్మెల్యే, అతడి అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను అడ్డుకుని బాధితులకు అండగా నిలిచిన తన భర్త, న్యాయవాది బుచ్చిబాబును తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నట్లు తెలిపారు. (విలాసాల లేడీ.. రూ.4కోట్ల మోసం)

ఎమ్మెల్యే ఒత్తిడితో మిర్యాలగూడ పోలీసులు తమ ఇంట్లోకి చొరబడి ముఖ్యమైన ఫైళ్లు, కాగితాలు, పాస్‌ పుస్తకాలు, దస్తావేజులతో పాటుగా కీలకమైన పత్రాలను లాక్కెళ్లారని ఆమె వివరించారు. తన భర్త, కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని మండిపడ్డారు. అక్రమ కేసులు బనాయించిన మిర్యాలగూడ పోలీసులు, వేధింపులకు కారణమైన ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు