మొదటి జీతం.. పేదలకు అంకితం

13 Feb, 2021 08:13 IST|Sakshi

మహిళా కానిస్టేబుల్‌ సేవాభావం

గీసుకొండ : వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా నియామకమైన వలపదాసు అనూష ఇటీవల విధుల్లో చేరింది. ఆమె మొదటి నెల వేతనాన్ని పేదల ఆకలి తీర్చడానికి వెచ్చించి ఆదర్శంగా నిలిచింది. ఆకలితో అలమటిస్తున్న వంద మంది నిరుపేదలు, భిక్షమెత్తుకునే వారికి భోజనం అందజేసింది. వరంగల్‌ నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ తోట ప్రాంతానికి చెందిన అనూష తండ్రి చిన్నతనంలో చనిపోయారు. తల్లి బీడీలు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. అనూష పేదరికంలో బతుకుతూనే ఎంఏ బీఈడీ వరకు చదువుకుని ప్రైవేట్‌ టీచర్‌గా పని చేస్తూ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం సంపాదించింది. పేదవారికి సాయం చేయా లానే సంకల్పంతో మొదటి వేతనంతో ఆహారం సమకూర్చానని, రానున్న రోజుల్లో తన శక్తి మేరకు సాయపడతానని అనూష చెబుతోంది. ఆమె పేదలకు ఆహార పొట్లాలు అందిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో పలువురు అభినందిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు