రంగారెడ్డిలో విషాదం.. టీకా తీసుకున్న కాసేపటికే..

20 Oct, 2021 19:21 IST|Sakshi

నందిగామ మండలం మేకగూడలో విషాదం

విచారణ జరుపుతామంటున్న అధికారులు 

సాక్షి,నందిగామ(రంగారెడ్డి): కోవిడ్‌ టీకా తీసుకున్న కొద్దిసేపటికే ఓ మహిళ మృతి చెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని మేకగూడలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మేకగూడకు చెందిన చిగుర్లపల్లి మానస (32) మంగళవారం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన క్యాంప్‌లో వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకుంది. ఇంటికి వెళ్లిన ఆమె గంట తర్వాత స్పృహతప్పి పడిపోయింది. ( చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి వెనకాలకు తీసుకెళ్లాడు.. తెల్లారేసరికి! )

కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌లోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మానస వ్యాక్సిన్‌ తీసుకోవడంతోనే మృతి చెందిందా.. లేక అనారోగ్యంతో మృతి చెందిందా అనేది పోస్టుమార్టం నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

విచారణ జరుపుతాం..
మానస గత నెల 18న మొదటి డోస్‌ తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఈరోజు రెండో డోసు తీసుకుంది. డోస్‌ తీసుకున్న గంట తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందిందని గ్రామస్తుల ద్వారా తెలిసింది. మానసకు ఇచ్చిన వ్యాక్సిన్‌ వాయిల్‌లో తొమ్మిది మందికి టీకాలు ఇవ్వడం జరిగింది. మిగతా ఎనిమిది మంది ఆరోగ్యంగానే ఉన్నారు. ఎలా చనిపోయిందో విచారణ జరుపుతాం. 
– డాక్టర్‌ దామోదర్, జిల్లా ఉప వైద్యాధికారి 

చదవండి: ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని.. 

మరిన్ని వార్తలు