నడిరోడ్డుపై ప్రసవించిన మహిళ..

30 Mar, 2021 04:59 IST|Sakshi

వైద్యం అందక శిశువు మృతి  

 గాంధీ ఆసుపత్రికి మహిళ తరలింపు  

జవహర్‌నగర్‌: ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ ఎన్ని రకాల ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నప్పటికీ నేటికీ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందని పరిస్థితే ఉంది. హైదరాబాద్‌ నగరానికి కూతవేటు దూరంలోగల జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఓ పేద గర్భిణి రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది. తీవ్ర ప్రసవ వేదనను అనుభవిస్తూ శిశువుకు జన్మనిచ్చినప్పటికీ కనీసం తల్లి నుంచి శిశువును వేరు చేసేందుకు పేగును కత్తిరించేవారు లేకపోవడంతో ఈ లోకంలోకి అడుగుపెట్టిన ఆ ప్రాణం కొద్ది నిమిషాల్లోనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకరమైన జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే జరగడం మరింత విషాదకరం.  

రోడ్డుపై స్పృహతప్పి పడిపోయి..ప్రసవం 
మేడ్చల్‌కు చెందిన లక్ష్మి 8 నెలల గర్భిణి. కొంత కాలంగా ఆమె కాలి గాయంతో బాధపడుతోంది. తీవ్రమైన నొప్పితో ఆమె చికిత్స కోసం సోమ వారం ఉదయం 11.30 గంటలకు జవహర్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు చేరుకుంది. ఆసుపత్రి ఆవరణలో ఉన్న బెంచ్‌పై కూర్చొని ఉండగా కాలి గాయం నుంచి చీము కారుతుండటాన్ని ఫార్మసిస్ట్‌ గమనించింది. ఇదే అంశాన్ని స్టాఫ్‌ నర్సు సుశీలకు వివరించింది. గాయానికి డ్రెసింగ్‌ చేయాల్సిందిగా కోరడంతో హోలీ సెలవు నేపథ్యంలో డ్రెసింగ్‌ చే యడం కుదరదని, మంగళవారం ఉదయం వస్తే చేస్తామని చెప్పి, నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్‌ కిల్లర్‌ మందులు ఇచ్చి పంపారు. దీంతో లక్ష్మి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లింది. కాగా, నీరసంతో ఉ న్న ఆమె ఆసుపత్రి సమీపంలోని రోడ్డుపై స్పృహ తప్పి పడిపోయింది.

ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డుపైనే మగబిడ్డకు జన్మనివ్వడాన్ని స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పేగును కత్తిరించి తల్లి నుంచి బిడ్డను వేరు చేశారు. అప్పటికే శిశువు చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. స్పృహతప్పి పోయిన ఆ బాలింతను మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించగా, అత్యవసర విభాగంలో అడ్మిట్‌ చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నారు.  

గర్భవతి అని చెప్పలేదు: సుశీల స్టాఫ్‌ నర్సు, 
జవహర్‌నగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌  

లక్ష్మి తను కాలి నొప్పితో బాధపడుతున్నట్లు చె ప్పింది. గాయానికి డ్రెస్సింగ్‌ చేయాలని కోరింది. మంగళవారం రావాల్సిందిగా సూచించాను. అయి తే తను గర్భిణి అనే విషయాన్ని చెప్పలేదు.  

మరిన్ని వార్తలు