రెండు గ్యాంగ్‌లుగా వచ్చి.. రూ.100 గిరాకీ చేసి.. రూ.10000 విలువైనవి ఎత్తుకెళ్లారు..

26 Nov, 2022 12:46 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఓ బట్టల దుకాణంలో రూ.100ల గిరాకీ చేసి, రూ.10000 విలువ గల దుస్తులను చోరీ చేసిన ఘటన శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా.. మండలకేంద్రంలోని ఓ బట్టల దుకాణంలోకి గుర్తు తెలియని ముగ్గురు మహిళలు వచ్చి స్కార్ఫ్‌ కావాలని అడిగారు. యజమాని స్కార్ఫ్‌ను చూపిస్తుండగా.. మరో మహిళ ఇద్దరు పురుషులతో కలిసి దుకాణంలోకి వచ్చారు. తమకు బెడ్‌ షీట్లు కావాలని, తొందరగా చూపించాలని ఒత్తిడి తెచ్చారు.

సదరు యజమాని మొదట వచ్చిన మహిళలను కొద్దిసేపు ఆగమని చెప్పి దుకాణంలోని రెండో గదిలోకి వెళ్లాడు. ఇదే సమయంలో మొదట వచ్చిన మహిళలు అక్కడ ఉన్న 10చీరెలున్న కట్ట, ఐదు ప్యాంట్‌ షర్టుల కట్టలను తమ చీర లోపల పెట్టుకున్నారు. తమకు స్కార్ఫ్‌ ఇవ్వాలని లేకుంటే వెళ్లిపోతామని యజమానిని తొందర చేశారు. దీంతో యజమాని ముందు రూంలోకి వచ్చి వారికి స్కార్ఫ్‌ను ఇవ్వగా.. వారు యజమానికి రూ.వంద నోటు ఇచ్చి వెళ్లి పోయారు.

తదుపరి వచ్చిన మహిళ ఇద్దరు పురుషులకు యజమాని బెడ్‌షీట్‌లు చూపించగా అవి తమకు నచ్చిన రంగులో లేవని వెళ్లిపోయారు. వారందరూ వెళ్లిపోయిన తర్వాత దుకాణంలోని 10 చీరెల కట్ట, ఐదు ప్యాంటు షర్టుల కట్ట కనిపించకపోవడంతో సదరు యజమాని ఆందోళన చెందాడు. చుట్టుపక్కల దుకాణదారులకు విషయం వివరించగా.. సదరు గుర్తుతెలియని వ్యక్తుల కోసం గాలించారు. వారు దొరకకపోవడంతో యజమాని వేదనకు గురయ్యా డు. రెండేళ్ల క్రితం కూడా భిక్కనూరులోని ఓ బట్టల దుకాణంలో ఇదేవిధంగా చీరలను ఎత్తుకెళ్లారు.  

మరిన్ని వార్తలు