నీటిలో వణుకుతూ రాత్రంతా జాగారం 

3 Oct, 2021 04:14 IST|Sakshi
మూసీ వాగు నుంచి మహిళను బయటకు  తీసుకొస్తున్న రాయినిగూడెం వాసులు, పోలీసులు 

మూసీవాగులో చిక్కుకున్న మహిళ 

కేకలు వేయడంతో కాపాడిన స్థానికులు 

సూర్యాపేట జిల్లాలో ఘటన 

సూర్యాపేటరూరల్‌: ఓ మహిళ మూసీ వాగులో చిక్కుకుని రాత్రంగా నీటిలోనే జాగారం చేయాల్సి వచ్చింది. స్థానికులు గమనించి ఆమెను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా కొల్లూరు గ్రామానికి చెందిన కట్ట రాములమ్మ (65)కాలినడకన గ్రామాలు తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో గురువారం ఉప్పల పహాడ్‌ గ్రామానికి వచ్చింది. శుక్రవారం భిక్షాటన చేసి టేకుమట్ల శివారులోని మూసీవాగులో కల్వర్టు ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ నీళ్లులేకపోవడంతో భోజనం చేసి నిద్రపోయింది. అయితే రత్నపురం మూసీ ప్రాజెక్టు అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా మూసీ వాగుకు నీటి తాకిడి పెరిగింది. దీంతో నిద్రలో ఉన్న ఆమె నీటిలో కొంతదూరం కొట్టుకుపోయింది.

ఈ క్రమంలో ఆమెకు ఓ రాయి దొరకడంతో దాన్నిపట్టుకుని రాత్రంతా నీళ్లల్లో వణుకుతూ గడిపింది. కాపాడమని కేకలు వేస్తోన్న ఆమెను రాయినిగూడెం వాసులు గమనించి వెంటనే సూర్యాపేట రూరల్‌ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో పడవలు వేసుకుని వెళ్లి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు