నగర యంత్రాంగంలో నారీమణుల ప్రత్యేక ముద్ర 

8 Mar, 2021 07:52 IST|Sakshi

పదవుల్లో కీలక పాత్ర పోషిస్తున్న అతివలు

విద్యాశాఖ మంత్రి, రంగారెడ్డి జెడ్పీ చైర్‌ పర్సన్‌ మహిళలే..

బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్, కలెక్టర్, డీఈఓ సైతం..

గ్రేటర్‌ పరిధిలో సగానికిపైగా అధికారులు వీరే..

విధానపర నిర్ణయాల అమలులో తమదైన పాత్ర

సాక్షి, హైదరాబాద్‌ : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అమ్మలా లాలించడమే కాదు అధికారిగా పాలించడంలోనూ తమదైన శైలితో ముందుకెళ్తున్నారు మహిళామణులు. నగర పరిపాలనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల అమలులోనూ అతివలు అందెవేసిన చేయిగా నిలుస్తున్నారు. తమదైన ముద్రతో నగర శివారు నుంచి రాష్ట్ర మంత్రి మండలిలోనూ ప్రాతినిధ్యం వహిస్తూ ఔరా అనిపిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్‌గా గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా తీగల అనితారెడ్డి సారథ్యం వహిస్తున్నారు. హైదరాబాద్‌ కలెక్టర్‌గా, మేడ్చల్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా శ్వేతా మహంతి కొనసాగుతున్నారు. వీరితో పాటు మరికొందరు నారీమణులు ప్రభుత్వ పాలనలోని పలు ప్రధాన విభాగాల్లో కీలక పదవులతో పాటు క్షేత్ర స్థాయిలో సైతం ప్రధాన భూమికగా ఉన్నారు. సమర్థ సేవలతో నగర వాసుల మన్ననలు అందుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తమదైన పాత్రను ఇనుమడింపజేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం


హైదరాబాద్‌ కలెక్టర్, మేడ్చల్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి

బల్దియా పరిధిలో.. 
హైదరాబాద్‌ మహానగర పాలక వర్గంలో సగానికిపైగా మహిళామణులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలనా యంత్రాంగంలో సైతం పలు కీలక పదవుల్లో మహిళలే ఉన్నారు. ఉప్పల్‌ డిప్యూటీ కమిషనర్‌గా అరుణ కుమారి, సంతోష్‌నగర్‌ డీసీగా మంగ తాయారు, చాంద్రాయణగుట్ట డీసీగా రీచా గుప్తా, కుత్బుల్లాపూర్‌ డీసీగా మంగ తాయారు, కూకట్‌పల్లి డీసీగా  ప్రశాంతి, ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌గా ప్రావీణ్య, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌గా మమత, ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ విభాగం అడిషనల్‌ కమిషనర్‌ ప్రియాంక, పరిపాలన విభాగానికి సరోజ, ఎన్నికల విభాగానికి పంకజ, ఎస్‌ఎన్‌డీపీ ఓఎస్‌డీగా వసంత,  ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌గా సరోజా రాణి, యూసీడీ విభాగం పీడీగా సౌజన్య నగర వాసులకు సేవలందిస్తున్నారు. 
 

హైదరాబాద్‌ డీఈఓ రోహిణి

హైదరాబాద్‌ జిల్లాలో.. 
హైదరాబాద్‌ జిల్లాలో కలెక్టర్‌గా శ్వేతా మహంతి పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా రోహిణి, చీఫ్‌ రేషనింగ్‌ అధికారిణి బాలమాయాదేవి, ప్రభుత్వ భూముల న్యాయ విభాగం అధికారిగా, స్పెషల్‌ కలెక్టర్‌గా సంగీత, సికింద్రాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ అధికారిగా వసంతకుమారి తదితరులు విధులు నిర్వర్తిస్తున్నారు. 


మేడ్చల్‌ డీఆర్‌డీఏ పీడీ జ్యోతి, మేడ్చల్‌ డీఈఓ విజయకుమారి

చదవండి: సివంగి సింగిల్‌గానే వస్తుంది

మేడ్చల్‌లో జిల్లా పరిధిలో.. 
మేడ్చల్‌ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గానూ శ్వేతా మహంతి సేవలందిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా విజయ కుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారిగా పద్మజ, ఉపాధి కల్పన అధికారిగా నిర్మల, బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఝాన్సీరాణి, డీఆర్‌డీఏ పీడీగా జ్యోతి, కార్మిక శాఖాధికారిణి ప్రభావతి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణిగా విజయకుమారి, జిల్లా వ్యవసాయ అధికారిగా రేఖామేరి, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారిగా జ్యోతి, పౌరసంబంధాల శాఖ డీడీగా నాగాంజలిలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా పలు రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. పురుషులకు దీటుగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారనేందుకు వీరే నిదర్శనం.  

అతివలు అన్ని రంగాల్లో ఎదగాలి: సబితారెడ్డి 
మహిళలు గౌరవించిన చోట దేవతలు కొలువుంటారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు