Work From Home Survey: ఆఫీసుకు వెళ్తేనే అసలు మజా!

2 Jul, 2021 20:17 IST|Sakshi

టీమ్‌ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు ఆఫీసే కీలకమన్న 71% మంది

కో–వర్కింగ్‌ నెట్‌వర్క్‌ స్టార్టప్‌ కంపెనీ ‘ఆఫీస్‌’సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడి

వృత్తినిపుణుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి: అమిత్‌ రమణి, సీఈవో,ఫౌండర్, ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌

సాక్షి, హైదరాబాద్‌: రోజూ ఆఫీసుకు వెళ్లి పనిచేయడంలోనే అసలైన కిక్కు ఉందని ఐటీ, టెక్, ఇతర రంగాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్‌ కారణంగా భద్రత, రక్షణ దృష్ట్యా ఇళ్ల నుంచే పనిచేసే ఏర్పాటు బాగానే ఉన్నా ఆఫీసు వాతావరణంలో పనిచేయడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు. భారత్‌లో ప్రస్తుత పని విధానం, పనిచేసే వ్యవస్థలు, తదితరాలపై కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ ఎలాంటి ప్రభావం చూపిందన్న దానిపై కో–వర్కింగ్‌ నెట్‌వర్క్‌ స్టార్టప్‌ కంపెనీ ‘ఆఫీస్‌’(ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌) నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మే–జూన్‌ మధ్యలో ‘ఆఫీస్‌’వర్క్‌ స్పేస్‌ సర్వే రిపోర్ట్‌’లో వివిధ మెట్రో నగరాల్లోని వివిధ హోదాలు, వృత్తులు, రంగాల్లో పని చేస్తున్న వెయ్యిమంది వృత్తి నిపుణుల నుంచి ఆయా అంశాలపై సమాధానాలు రాబట్టారు. 


సర్వేలో వెల్లడైన పలు ఆసక్తికరమైన అంశాలివే..
► వివిధ ప్రాజెక్ట్‌లపై పనిచేసేపుడు టీమ్‌ సభ్యులను ఆఫీసుల నుంచి మరింత బాగా సమన్వయం చేసుకోవచ్చని 71 శాతం మంది అభిప్రాయం వెల్లడించారు.
 
► ఆఫీసు వాతావరణంలో స్వయంగా విధుల్లో పాల్గొనడంతో వివిధ రూపాల్లో అక్కడున్న నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ ఉత్తమంగా ఉంటోందన్న 72 శాతం మంది అభిప్రాయపడ్డారు.
 
► ఉద్యోగుల మధ్య పరస్పర సహకారం, పనిసంస్కృతి, ఆఫీసులో పని వాతావరణం తదితరాలు వ్యాపారాలు, వాణిజ్యాలు విజయవంతానికి ఉపయోగపడతాయన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
 
► సుదీర్ఘకాలం పాటు ఇళ్ల నుంచి పనిచేయడం వల్ల ‘కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌’పట్ల అసంతృప్తితో ఉన్నామని 74 శాతం మంది చెప్పారు.
 
► హైబ్రిడ్‌ వర్కింగ్‌ మోడల్, పని విధానంలో పనిచేసేందుకు 72 శాతం మంది మొగ్గు చూపారు.
 
► ఎక్కువ జీతం కోసం తమకు అనుకూలం, అనువైన పనివిధానంలో పనికి అంగీకరించే కంపెనీల్లోకి మారేందుకు 57 శాతం మంది సిద్ధంగా ఉన్నారు.
 
► ఇళ్లకు దగ్గర్లోని బ్రాంచీ ఆఫీస్, కంపెనీ అందించే కో వర్కింగ్‌ స్పేస్‌లలో పనిచేయాలని కోరుకుంటున్న వారు 58 శాతం మంది.  

► వ్యాక్సిన్లు వేసుకున్నాక కొన్నిస్థాయిల్లోని సడలింపులతో ఆఫీసులకు వెళ్లేందుకు సిద్ధమన్న వారు 82 శాతం మంది.  

పనిపద్ధతులు మార్చుకోవాల్సిన అవసరముంది 
‘కోవిడ్‌ మహమ్మారి పనివిధానం, సంస్కృతిలో అనేక మార్పులకు కారణమైంది. ఇంటి నుంచి పనిచేస్తుండటంతో తమకు కలిసొచ్చే అనువైన ‘హైబ్రిడ్‌ మోడల్‌’పనివిధానాన్ని ఎక్కువమంది కోరుకుంటున్నారు. అదేసమయంలో ఆఫీసులకు వెళ్లలేకపోవడం, సహోద్యోగులను కలుసుకోలేకపోవడం, అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకోలేకపోవడాన్ని కూడా ఫీలవుతున్నారు. మా సర్వేలో వెల్లడైన వివిధ అంశాలు, విషయాలను బట్టి కంపెనీలు కూడా తమ పని పద్ధతులను విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం.’ 
– అమిత్‌ రమణి, సీఈవో,ఫౌండర్, ఏడబ్ల్యూఎఫ్‌ఐఎస్‌ 

>
మరిన్ని వార్తలు