‘విజయగర్జన’ దేవన్నపేటలోనే! 

8 Nov, 2021 00:49 IST|Sakshi
సభాస్థలి వద్ద కొనసాగుతున్న పనులు 

29న సభానిర్వహణకు 1,100 ఎకరాల సేకరణ 

రైతుల అంగీకారంతో నిర్వహణ ఏర్పాట్లు షురూ

హసన్‌పర్తి: ఈ నెల 29న దీక్షాదివస్‌ రోజున టీఆర్‌ఎస్‌ నిర్వహించ తలపెట్టిన విజయగర్జన సభాస్థలి ఖరారైంది. రెండు, మూడు ప్రాంతాలను పరిశీలించి చివరికి హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని దేవన్నపేటలో బహిరంగసభ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. తొలుత ఇక్కడ సభానిర్వహణకు స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన విషయం విదితమే. సభాస్థలి కోసం తమ భూములను ఇచ్చేదిలేదని చెప్పిన రైతులు 3 రోజులుగా ఆందోళనలు చేపట్టారు.

ఈ క్రమంలో ఆదివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ సభ నిర్వహించే ప్రాంతంలోనే రైతులతో మాట్లాడారు. సభ కోసం భూములు చదును చేసిన తర్వాత తిరిగి హద్దులు గుర్తించడం కష్టమవుతోందని రైతులు, వెంచర్‌ నిర్వాహకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే భరోసా ఇవ్వడంతోపాటు పంటకు నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. దీంతో సభానిర్వహణకు భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖత వ్యక్తం చేసి అంగీకారపత్రాలను అందించారు.

దీంతో వెంటనే జేసీబీల ద్వారా భూమి చదును చేసే పను లు ప్రారంభించారు. కాగా, డ్రోన్‌ కెమెరాలతో సభ కోసం సేకరించనున్నట్టు భూమి మ్యాప్‌ను ప్రద ర్శించారు. విజయగర్జన సభకు దాదాపు పదిలక్షల మందిని తరలించనుండగా, ఇందుకోసం 1,100 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందులో 300 ఎకరాల్లో సభావేదిక, మరో 8 ఎకరాలు పార్కింగ్‌ కోసం కేటాయించనున్నారు. 20 వేల బస్సులు, మరో 20 వేల వాహనాల్లో కార్యకర్తలను తరలించనున్నట్లు టీఆర్‌ఎస్‌ శ్రేణులు తెలిపారు.

సభను విజయవంతం చేయాలి: ఎర్రబెల్లి 
విజయగర్జనసభను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివా రం సాయంత్రం సభాస్థలిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో పదిలక్షల మందితో సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు