World Blood Donor Day: ప్రతి రోజు 12 వేల మంది రక్తకొరతతో చనిపోతున్నారు..అయినా!

14 Jun, 2022 11:05 IST|Sakshi

సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని పదార్థాల్లో రక్తం అతిప్రధానమైనది. దేశ వ్యాప్తంగా ఉన్న 135 కోట్ల మందిలో అత్యవసర పరిస్థితుల్లో ఏటా ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరపడుతుందని నిపుణుల అంచనా. అయితే రక్తదాతల నుంచి లభిస్తుంది మాత్రం సుమారు 50 లక్షల యూనిట్లు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో ప్రతి రోజు దాదాపు 12 వేల మంది రక్తకొరతతో చనిపోతున్నారు. గత దశాబ్దకాలంగా రక్తదానం పైన అవగాహనా కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి స్పందన మాత్రం రక్త అవసరాలను తీర్చడానికి అనుగుణంగా లేవన్నది వాస్తవ సత్యం. నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. 
-సాక్షి, హైదరాబాద్‌

రక్త నిల్వలు నిండుకున్నాయి... 
ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తం అవసరపడుతుంది. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా తలసేమియా బాధితులు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు. రక్తదానం పై అపోహల వల్ల అవసరమైన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావట్లేదని  సర్వేలు పేర్కొంటున్నాయి. 18 సంవత్సరాలు నిండి 12.5 హిమోగ్లోబిన్‌ స్థాయితో 45 నుంచి 50 కిలోల బరువున్న ప్రతి ఆరోగ్యకరమైన వ్యక్తి రక్తదానానికి అర్హుడు. ఇలా ఒక్కో వ్యక్తి 65 సంవత్సరాల వయస్సు నిండే వరకు రక్తదానం చేయవచ్చని అరోగ్య నిపుణులు నిర్ధారించారు.
చదవండి: హైదరాబాద్‌: అక్కడ ట్రాఫిక్‌ జామ్‌.. ఇలా వెళ్లండి

ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్‌లెట్స్‌ దానం చేయవచ్చు. 15 రోజలకు ఒక సారి ప్లాస్మా దానానికి ఆస్కారం ఉంది. ఒక యూనిట్‌ రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు. మొత్తంగా 85 శాతం పాజిటివ్‌ గ్రూప్, 15 శాతం నెగెటివ్‌ గ్రూప్‌కు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా నెగెటివ్‌ గ్రూప్‌ వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి 20 వేల మందిలో ఒకరు బాంబే బ్లడ్‌ గ్రూప్‌తో పుడుతున్నారు.

ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు రక్తదాతల కోసం అవగాహనా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నప్పటికీ అవసరమైన స్థాయిలో రక్త నిధులను సమకూర్చలేకపోతున్నామని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. షుగర్, హెచ్‌ఐవీ, హెపటైటీస్, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు స్వచ్చంథంగా రక్తదానానికి ముందుకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తరచు రక్తదానం చేసేవారికి గుండెపోటు, క్యాన్సర్‌ వంటి జబ్బులు దరిచేరవని మెడికల్‌ సర్వేలు నిర్థారిస్తున్నాయి.  

258 సార్లు రక్తదానం చేశా... 
గత 22 సంవత్సరాల్లో 258 సార్లు రక్తదానం చేసి ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పాను. అంతేకాకుండా వ్యక్తిగతంగా, సోషల్‌మీడియా వేదిక ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న 20 వేల మందికి సకాలంలో రక్తాన్ని అందించగలిగాను. సరైన సమయానికి రక్తం అందక ఒక వ్యక్తి చనిపోయారన్న వార్త తెలుసుకుని రక్తదానం చేయడం ప్రారంభించాను. రక్తదానంపై యువకుల ఆలోచనా విధానం మారాలి. యువకులు అధికంగా ఉన్న మన దేశంలో రక్తం అందక బాధితులు చనిపోవడం శోచనీయం. 
–డా.సంపత్‌ కుమార్, సామాజిక వేత్త, బంజారాహిల్స్‌. 

12 వేల మందికి రక్తాన్ని అందించా. 
ఇప్పటి వరకు 116 సార్లు రక్తదానం చేశాను. పది సంవత్సరాల క్రితం నేను ప్రారంభించిన రెడ్‌ డ్రాప్‌ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో 12 వేల మందికి రక్తాన్ని అందించగలిగాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 58 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాను. రక్తదానం కోసం కృషి చేస్తున్న వారికి ఏటా సంస్థ ఆధ్వర్యంలో అవార్డులను ఇస్తున్నాము.   
–రెహమాన్, హైదరాబాద్‌.  

మరిన్ని వార్తలు