ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌: ఈ నటీమణుల డైట్‌ ఏంటో తెలుసా?

7 Apr, 2021 08:47 IST|Sakshi

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆ తరం.. దీనికి నిదర్శనం వారి ఆరోగ్యకర జీవన విధానం.. ప్రస్తుతం మనిషి జీవిత కాలం క్షీణిస్తూ, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న తరుణంలో పాతకాలపు ఆహార పద్ధతులను అన్వేస్తున్నారు. నేడు ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఆ తరం నటీమణుల ఆహార అలవాట్లు, వారి జీవన విధానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం..                 
– సాక్షి, సిటీబ్యూరో 

గంజినే సూప్‌గా తాగేవాళ్లం..  

66 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యంతో ఉన్నానంటే చిన్నప్పుడు నేను పెరిగిన విధానం మాత్రమే. ఇంట్లో అమ్మ చేసిన ఆహారం తప్ప బయటి చిరుతిల్లు ఉండేవి కావు. మా తరంలో పుట్టుసారం బాగుండేది. మా అమ్మ 8 నెలల గర్భిణిగా ఉండే వరకు మొదటి పాపకు పాలను ఇచ్చేది. అప్పుడు బియ్యం, జొన్నల నుంచి తీసిని గంజిని సూప్‌గా ఇచ్చేవారు. చెట్టుపైనే మగ్గిన పండ్లను తినేవాళ్లం. నేను తులసి, కరివేపాకు, వాము, సొంటి, మిరియాలు, ధనియాలు, జిలకర్ర మిశ్రమాల పొడితో కాచిన డికాషన్‌ మాత్రమే తాగుతాను.  
– క్రిష్ణవేణి, హిట్లర్‌ గారి పెళ్లాం సీరియల్‌ 

బతకడానికి తినాలి..  

నేను ఆరి్టస్ట్‌ని.. ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉండాలి. దీనికి నా బాల్యంలోని ఆహార పద్ధతులే సహకరించాయి. ఇప్పటికీ నాకు బీపీ, షుగర్‌లాంటి సమస్యలు లేవు. పస్తుతం నీళ్లు, పాలు, నూనె, కూరగాయలు, బియ్యం ఏది చూసినా కల్తే.. ప్రస్తుతం పలువురు ఆరోగ్య నిపుణులు అధికంగా అన్నం తినకూడదని చెబుతుంటారు.  మేమైతే అన్నీ తినేవాళ్లం. దానికి తగ్గ శారీరక శ్రమ చేసేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అన్నం తగ్గించి చిరుధాన్యాలను అధికంగా తీసుకోవాలి. బతకడానికి తినాలి.. తినడానికి బతకకూడదు.     
– శివపార్వతి. ఇంటి గుట్టు సీరియల్‌ 

సౌత్‌ ఇండియన్‌ ఫుడ్‌.. 

నా ఫిట్‌నెస్‌కి ముఖ్య కారణం వర్క్‌హాలిక్‌గా, నాన్‌ఆల్కాహాలిక్‌గా ఉండటం. ముఖ్యంగా నాకు ఇష్టమైన దక్షినాదిలోని ఆహారపు అలవాట్లు మంచి ఆరోగ్యాన్నిచ్చాయి. సౌత్‌ ఇండియన్‌ ఫుడ్‌ అయిన ఇడ్లి ఇంటర్నేషనల్‌ లైట్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మారింది. మొదటి నుంచి శాఖాహారిని కావడం వలన మానసికంగా శారీరకంగా ఫిట్‌గా ఉన్నాను. స్వచ్ఛమైన నెయ్యిని ఫుడ్‌లో వాడుతుంటాను. ఇది ఆరోగ్యాన్నే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నాలోని డాన్స్‌ స్కిల్స్‌ నేను ఫిట్‌గా, గ్లామర్‌గా ఉండటానికి మరో కారణం.  
– సుధా చంద్రన్, నెంబర్‌ వన్‌ కోడలు సీరియల్‌ 

మానసిక ఆరోగ్యం అవసరమే.. 

శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ అన్ని పనులను ఉత్సాహంగా చేస్తున్నానంటే అనవసర విషయాలను పట్టించుకోకపోవడమే. ఈ మానసిక ధృడత్వానికి కారణం నా ఆహార అలవాట్లే. విటమిన్లు, ప్రొటీన్స్‌ అధికంగా అందించే బొప్పాయి వంటి పండ్లను అధికంగా తింటాను. ఎలాంటి డైట్‌ను పాటించను. జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉంటూ అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తాను. ఫ్రూట్, వెజిటేబుల్‌ జ్యూస్‌లు తాగుతూ వ్యాయామం చేస్తాను.  
 – లక్ష్మీ ప్రియ, నాగభైరవి సీరియల్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు