భారత్‌లో దారుణమైన పరిస్థితులు.. దంత ఆరోగ్యంపై ఖర్చు ఇంత తక్కువా?

28 Nov, 2022 08:15 IST|Sakshi

నోటి అనారోగ్యాన్ని ప్రజారోగ్య సమస్యగా గుర్తించని ఇండియా

ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడి

దేశంలో తీవ్రమైన దంత సమస్యలున్నవారు 21.8 శాతం

నోటి జబ్బుల వల్ల జరుగుతున్న నష్టం రూ.60 వేల కోట్లపైనే..

పొగాకు, ఆల్కహాల్, పంచదార ఉత్పత్తులతో దంత సమస్యలు

దీనిపై ప్రజల్లో తగిన అవగాహన లేదని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో దంతాల ఆరోగ్యంపై నిర్లక్ష్యం కనిపిస్తోందని, దీనివల్ల భారీగా నష్టం కలుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసింది. భారత్‌లో దంత ఆరోగ్యం కోసం ఏటా చేస్తున్న తలసరి సగటు ఖర్చు కేవలం నాలుగు రూపాయలేనని పేర్కొంది. ఈ మేరకు ‘ఓరల్‌ హెల్త్‌ ఇన్‌ ఇండియా’ పేరిట ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో నోటి అనారోగ్యాన్ని ప్రజారోగ్య సమస్యగా గుర్తించ లేదని.. నోరు, దంతాలకు సంబంధించి వచ్చే ఐదు ప్రధాన జబ్బులతో దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా రూ.60 వేల కోట్ల నష్టం వస్తోందని తెలిపింది.

ఇండియాలో ఒకటి నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసువారిలో 43.3 శాతం మందికి దంత సమస్యలు ఉన్నాయని తెలిపింది. ఐదేళ్లపైబడిన వారిలో 28.8 శాతం మందికి తేలికపాటి దంత సమస్యలు ఉన్నాయని వివరించింది. 15 ఏళ్లకు పైబడిన వారిలో 21.8 శాతం మందికి తీవ్రమైన దంత సమస్యలు ఉన్నాయని పేర్కొంది. 20 ఏళ్లు దాటినవారిలో దంతాలు లేనివారు నాలుగు శాతం మంది ఉన్నట్టు తెలిపింది.

ఇక నోటి, పెదవుల కేన్సర్లకు సంబంధించి 2020లో 1.35 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని. ఇందులో మహిళలు 31,268 మంది, పురుషులు 1.04 లక్షల మంది ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక వెల్లడించింది. సగటున ప్రతి లక్ష జనాభాలో 9.8 మందికి నోటి, పెదవుల కేన్సర్‌ కేసులున్నాయని తెలిపింది. ఆల్కహాల్, పొగాకు, పంచదార ఉత్పత్తులే ఈ దంత సమస్యలకు కారణమని పేర్కొంది.

డబ్ల్యూహెచ్‌వో నివేదికలోని పలు  కీలక అంశాలివీ
►మన దేశంలో ప్రతి ఒక్కరు వివిధ రూపాల్లో కలిపి రోజుకు సగటున 53.8 గ్రాముల పంచదార వినియోగిస్తున్నారు.
►15 ఏళ్లు పైబడినవారిలో పొగాకు ఉత్ప­త్తులు వాడేవారు 28.1శాతం కాగా..ఇందులో మహిళలు 13.7 శాతం, పురుషులు 42.4 శాతం.
►15 ఏళ్లు పైబడినవారిలో తలసరి సగటున ఏడాదికి 5.6 లీటర్ల మద్యం తాగుతున్నారు. ఇందులో మహిళలు 1.9 లీటర్లు, పురుషులు 9.1 లీటర్లు తాగుతున్నారు.
►2019 లెక్కల ప్రకారం ఇండియాలో దంత వైద్య సహాయకులు 3,515 మంది, దంతాలను కృత్రిమంగా అమర్చే టెక్నీషియన్లు 3,090 మంది, దంత వైద్యులు 2.71 లక్షల మంది మాత్రమే ఉన్నారు.
►ఐదేళ్లలో ప్రతి పదివేల జనాభాకు ఇద్దరు మాత్రమే కొత్తగా దంత వైద్యులు అందుబాటులోకి వచ్చారు.
►దేశంలో అధునాతన దంత వైద్యానికి సంబంధించి బీమా సౌకర్యం లేదు. ప్రమాదాలు, ఇతర కారణాలతో దంతాలు పోయినా బీమా సౌకర్యం వర్తించడం లేదు.
►దేశంలో జాతీయ ఓరల్‌ పాలసీ ఉన్నా దంత ఆరోగ్యంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగడం లేదు. సమస్య తీవ్రమైతేగానీ బాధితులు పట్టించుకోవడం లేదు.

దంత సమస్యలపై ప్రజల్లో అవగాహన తక్కువ
మన దేశంలో దంత, గొంతు సమస్యలపై అవగాహన తక్కువ. దంత సమస్యలుంటే సంతులిత ఆహారం తీసుకోలేం. ఇవి దీర్ఘకా­లిక జబ్బులకు కారణం అవు­తాయి. నోరు, దంతాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు పొగాకు, ఆల్కహాల్, తీపి పదార్థాలకు దూరంగా ఉంటే జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
– డాక్టర్‌ హరిత మాదల, దంత వైద్యులు, నిజామాబాద్‌

పొగాకు వినియోగమే ప్రధాన కారణం
నోటి కేన్సర్, దంతాల సమస్యలకు చాలా వరకు పొగాకు వినియోగమే ప్రధాన కారణం. ఐసీఎంఆర్‌ అంచనాల ప్రకారం దేశంలో కేన్సర్‌తో బాధితుల సంఖ్య 2025 నాటికి దాదాపు 29.8 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. కేన్సర్‌ చికిత్సకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు వెచ్చిస్తున్నప్పటికీ.. దాని మూలకారణమైన పొగాకు వినియోగం నియంత్రణపై తగినస్థాయిలో దృష్టి సారించడం లేదు. దేశంలో పొగాకు వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. టీనేజ్‌ పిల్లలు పొగాకు వ్యసనానికి గురికాకుండా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలి.
– నాగ శిరీష, వలంటరీ హెల్త్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా

మరిన్ని వార్తలు