WHO: డబ్ల్యూహెచ్‌వో కీలక సూచనలు.. ఇకపై నర్సులూ..

29 Sep, 2021 02:27 IST|Sakshi

సాధారణ ప్రసవాలు చేయొచ్చు 

ప్రాథమిక వైద్యం చేసే అధికారం కల్పించవచ్చు 

ఛత్తీస్‌గఢ్‌ మాదిరి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన 

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక వైద్యంలో నర్సులకు స్థానం కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. మందుల చీటీ (ప్రిస్కిప్షన్‌) రాసే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ మేరకు మన దేశానికి కొన్ని సూచనలు చేస్తూ నివేదిక విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ పూర్తయిన నర్సులకు ఆరు నెలల శిక్షణ ఇచ్చి వారితో మందులు ఇప్పించవచ్చని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్లకు ప్రత్యేకంగా నిర్ణీత కోర్సు చేసినవారికి ప్రిస్కిప్షన్‌ రాసే అవకాశం కల్పించారు. ఆ రాష్ట్రంలో రూరల్‌ మెడికల్‌ అటెండర్‌ (ఆర్‌ఎంఏ) వ్యవస్థ ఉంది. వారికి కొన్ని రకాల మందులు రాసే అధికారం, వైద్యం చేసేందుకు అవకాశం కల్పిం చారు.

ఎసిడిటీ మందులు, యాంటీబయోటిక్స్, టీబీ, మలేరియా, లెప్రసీ, అమీబియాసిస్, గజ్జి, తామర, ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్, వైరస్‌కు సంబంధించిన మందులు ఇవ్వొచ్చు. వాంతులు, జ్వరాలు, నొప్పు లు, విరేచనాలు, ఆస్తమా, దగ్గు, గర్భం ఆపే మందులు, విటమిన్లు, సాధారణ ప్రసవాలు జరిగాక మందులను ఇచ్చే అవకాశం ఆర్‌ఎంఏలకు ఇచ్చారు. వాళ్లే కొన్ని ఆపరేషన్లు చేస్తున్నారు. దెబ్బతగిలితే కుట్లు వేయడం, కాలిన గాయాలకు డ్రెసిం గ్‌ చేయడం, ఎముకలు విరిగితే కట్లు కట్టడం, ప్రమాదం జరిగితే రక్తస్రావం జరగకుండా చేయడం, ప్రసవాలు చేయడం, ప్రసవాల్లో చిన్నచిన్న సమస్యలు వస్తే వాటికి చికిత్స చేయడం, రక్తస్రావాలు జరిగితే ఆపడం వంటివి చేయాలి. అయితే పోస్ట్‌మార్టం, మెడికల్‌ లీగల్‌ కేసులు వంటి వాటిలో నర్సులకు అవకాశం కల్పించలేదు. ఇలా చత్తీస్‌ఘడ్‌ మాదిరిగా దేశవ్యాప్తంగా అమలుచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)లో మిడ్‌ లెవల్‌ కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు మందుల చీటీ ఇవ్వొచ్చని ఉంది. ఆ ప్రకారం నర్సులకు కూడా అవకాశం కల్పించాలని సూచించింది.  

డాక్టర్ల కొరత ఉన్నందున... 
కోవిడ్‌ వల్ల దేశంలో డాక్టర్లు ఆయా చికిత్సలపై దృష్టి సారించాల్సి వచ్చింది. పైగా భారత్‌లో డాక్టర్లు కొరత ఉంది. 11 వేల మందికి ఒక ప్రభుత్వ డాక్టర్‌ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. వెయ్యి జనాభాకు ఒక డాక్టర్‌ ఉండాలి. తక్కువ ఉన్నందున ఆ కొరతను నర్సులతో పూడ్చవచ్చు. దేశంలో యూనివర్సల్‌ హెల్త్‌ కేర్‌ను తీసుకురావాలని భావిస్తున్నారు. కాబట్టి వైద్య సిబ్బందిని వాడుకోవాలి. వైద్య పరిశోధనల్లో తేలిందేంటంటే.. ప్రాథమిక ఆరోగ్యంలో నర్సులు, వైద్యులు చేసే వైద్యంలో పెద్దగా తేడా లేదు. డాక్టర్లు, నర్సులు చేసిన చికిత్సలు సమానంగా ఉన్నాయి. అంతేకాదు అమెరికాలో శిక్షణ పొందిన నర్సులు వైద్యంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.  

మరికొన్ని అంశాలు
నర్సులు రోగంపై సొంతంగా నిర్ణయం తీసుకొని మందులు ఇవ్వడం లేదా డాక్టర్‌ పర్యవేక్షణలో ఇవ్వడం లేదా రెండు పద్ధతుల్లో ఇవ్వడం వంటివి చేయవచ్చు. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌లో ఈ పరిస్థితి ఉంది. పోలండ్‌లో మాస్టర్‌ నర్సింగ్‌ కోర్సు చేసినవారికి మందులు ఇచ్చే అవకాశం కల్పించారు. డెన్మార్క్‌లో డాక్టర్‌ పర్యవేక్షణలో నర్సులు మందులు ఇచ్చే పరిస్థితి ఉంది.  

భారత్‌లో దశల వారీగా కొన్ని నిర్ణీత జబ్బులకు మందులు ఇచ్చే అవకాశం కల్పించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  

ప్రస్తుతం ఇండియాలో మెడికల్‌ ప్రాక్టీషనర్లు మాత్రమే మందులు ఇవ్వాలన్న నిబంధన ఉంది. దాన్ని సవరించాలి. ఆ ప్రకారం డ్రగ్స్‌ అండ్‌ కాస్మెటిక్ట్‌ యాక్ట్‌–1940ని సవరించాలి. అలాగే ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ యాక్ట్‌–1947ను సవరిస్తూ, వారికి అధికారాలు కల్పించాలి. ఎన్‌ఎంసీ–2019 యాక్ట్‌లో కమ్యూనిటీ హెల్త్‌ ప్రొవైడర్‌ జాబితాలో నర్సులను చేర్చాలి.  

నర్సింగ్‌ విద్యలో పెనుమార్పులు తీసుకురావాలి. ప్రాక్టీస్‌ చేయడానికి ముందు వారికి శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం మాస్టర్‌ నర్సింగ్‌లో నర్స్‌ ప్రాక్టీషనర్‌ ఇన్‌ క్రిటికల్‌ కేర్‌ అనే కోర్సు ఉంది. దాని తరహాలో నర్సింగ్‌లో కోర్సు పెట్టాలి.  

కొన్ని మందులతో ప్రారంభించి వాటిని పెంచుకుంటూ పోవాలి. ప్రాథమిక వైద్యం డిగ్రీ నర్సింగ్‌లోనే కోర్సు ఉండాలి. ïజిల్లా, మెడికల్‌ కాలేజీల్లో పనిచేసే వారికోసం పీజీ లెవల్‌లో ప్రత్యేక కోర్సు ఉండాలి.   

మరిన్ని వార్తలు