World Photo Graphy Day: రీల్‌ నుంచి.. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వరకు..

19 Aug, 2021 07:42 IST|Sakshi

సాక్షి, విద్యానగర్‌(కరీంనగర్‌): మనిషి జీవన ప్రస్థానంలో ప్రతీరోజు ఓ మధుర జ్ఞాపకం. ప్రతీ మలుపును పదిలంగా కళ్ల ముందుంచేది ఫొటో. అందులో వేల భావాలు దాగుంటాయి. మారుతున్న రూపాన్ని జీవితాంతం కళ్లకు కడుతుంది. మన ఇంట్లోని ప్రతీ ఫొటో వెనక ఒక జ్ఞాపకం, అనుభూతి ఉంటుంది. పుట్టిన రోజైనా.. వివాహ వేడుకైనా.. సమావేశమైనా.. టూర్‌కు వెళ్లినా.. ఇలా ఎక్కడ ఏం జరిగినా.. అక్కడ ఆ జ్ఞాపకాలను పది కాలాలపాటు పదిలంగా ఉంచేందుకు కావాల్సింది ఫొటోగ్రఫీ.

కదిలిపోతున్న కాల ప్రవాహంలో చెదరని మధుర స్మృతుల ప్రతిబింబాలు ఫొటోలు. రసాయనాలతో రూపొందించిన ప్లేటుపై కాంతిచర్యతో ఓ రూపాన్ని బంధించడమే ఫొటోగ్రఫీ. ఈ పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఫొటో అంటే చిత్రం.. గ్రఫీ అంటే గీయడమని అర్థం. బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోల కాలం నుంచి నేడు ఫోన్‌ ద్వారా సెల్ఫీ, డ్రోన్‌ కెమెరాల దశకు కెమెరా కన్ను విస్తరించింది. నేడు వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

వృత్తి పోలీస్‌.. ప్రవృత్తి ఫొటోగ్రఫీ
రామడుగు(చొప్పదండి): రామడుగు మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన దాసరి మల్లేశ్‌ వృత్తిపరంగా ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పని చే స్తున్నారు. ఆయన తన కళ్లకు కనిపించిన అందమైన దృశ్యాలను కెమెరాలో బంధిస్తూ ఫొటోగ్రఫీని ప్రవృత్తిలా మార్చుకున్నారు. అంతేకాదు పెయింటింగ్‌ కూడా వేస్తున్నా రు. మహిమల కేదార్‌రెడ్డి వద్ద ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఆయన తీసిన ఫొటోలను చూచి చొప్పదండి ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్, పోలీస్‌ అధికారులు అభినందించారు. 
 

1827లో ఫొటో తీసే పరికరం..
18వ శతాబ్దంలో కెమెరాని కనుగొనడంతో ఫొటోగ్రఫీ ప్రారంభమవగా 1820లో రసాయనిక ఫొటోగ్రఫీ మొదలైంది. ఫొటోగ్రఫీకి జీవం పోసిన వారు ఫ్రాన్స్‌కు చెందిన లూయీస్‌ జాక్వెస్‌ మాండే డాగురే. స్వతహాగా చిత్రకారుడైన ఆయనకు ఒక్కో చిత్రం గీయడానికి 8 గంటల సమయం పట్టేది. దీన్ని సులభతరం చేయడానికి 1827లో జోసెఫ్‌ నెఫ్సర్‌ తన మిత్రుడు నిప్సెతో కలసి ప్రయోగాలు చేసి, ఫొటో తీసే పరికరాన్ని కనుగొన్నారు.

డాగురే 1839లో మొదటిసారి ఫొటోగ్రఫిక్‌ ప్రాసెస్‌ కనిపెట్టి, అదే ఏడాది ఆగస్టు 19న ప్రపంచానికి పరిచయం చేశాడు. సిల్వర్‌ అయోడైడ్‌ రసాయనంతో చిత్రానికి శాశ్వతత్వం కల్పించవచ్చని ప్రతిపాదించాడు. దీనికి గుర్తుగా 2010 నుంచి ‘వరల్డ్‌ ఫోటోగ్రఫీ డే’ జరుపుకుంటున్నారు. 1842 నుంచి 1880 మధ్య కాలంలో ఇండియాలో ఫొటోగ్రఫీ పరిశ్రమ విస్తరించింది. అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పోర్టరైట్‌ స్టూడియోను దీన్‌ దయాళ్‌ కెన్నడీ అనే మహిళ ప్రారంభిచారు. 1960 నాటికి స్టూడియో ఫొటోగ్రఫీ, 1980 నాటికి కంప్యూటర్‌తో కలర్‌ ఫొటోగ్రఫీ వచ్చింది. 

కలర్‌ ఫొటోగ్రఫీ..
1907లో లూమియర్‌ సోదరులు కనుగొన్న ఆటోక్రోమ్‌ అనే కలర్‌ ఫొటోగ్రఫీ ప్రక్రియ వాణిజ్యపరంగా విజయవంతమైంది. 1935లో కొడాక్‌ మొట్టమొదటి కలర్‌ ఫిలిం (ఇంటెగ్రల్‌ ట్రైప్యాక్‌ లేదా మోనోప్యాక్‌)ని కొడాక్రోమ్‌ పేరుతో పరిచయం చేసింది. అగ్ఫా కలర్‌ న్యూ 1936లో రూపుదిద్దుకుంది. 

డిజిటల్‌ ఫొటోగ్రఫీ..
1981లో సోనీ మావికా అనే కెమెరా ఛార్జీ కపుల్డ్‌ డివైస్‌ ఫర్‌ ఇమేజింగ్‌ అనే పరకరం ఉపయోగించి, కెమెరాలో ఫిలిం వాడే అవసరం లేకుండా చేశారు. 1991లో కొడాక్‌ ఈసీ 100 వాణిజ్య పరంగా అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి డిజిటల్‌ సింగిల్‌ లెన్స్‌ రిఫ్లెక్స్‌ కెమెరా. ఇది డిజిటల్‌ ఫొటోగ్రఫీకి నాంది పలికింది.

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌...
ఫొటోగ్రఫీ రంగంలో వచ్చిన ఆధునికత, డిజిటల్‌ ప్రక్రియతో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ జరుపుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. గతంలో పెళ్లి వేడుకలను పెళ్లి రోజు తీసే ఫొటోలతోనే సరిపెట్టుకున్న జంటలు ఇప్పుడు పెళ్లికి ముందు అందమైన లోకేషన్లలో ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ చేసుకుంటూ ఆ ఫొటోలను సోషల్‌ మీడియాతో పంచుకుంటున్నారు.

15 ఏళ్లుగా ఫొటోలు తీస్తున్న
నేను 15 ఏళ్లుగా ఫొటోలు తీస్తున్న. గోవాలో సిగ్మా ఆర్ట్‌ ఫొటోగ్రఫీ ఇండియా నిర్వహించిన పోటీల్లో జాతీయస్థాయిలో సిల్వర్‌మెడల్‌ పొందాను. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ చేతులమీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం ఆనందంగా ఉంది.     

– బత్తుల రాజు, గోదావరిఖని

కొత్త టెక్నాలజీ వచ్చింది
ఫొటోగ్రఫీలో ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. ప్రజలు ప్రీ, పోస్ట్‌ వెడ్డింగ్‌ షూట్స్‌తోపాటు ఫొటోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టెక్నాలజీ పరంగా ముందుకెళ్లినా కరోనాతో రెండేళ్లు వెనక్కి వెళ్లినట్లయింది. ఇప్పుడు శ్రావణమాసం కావడంతో కొద్దిగా గిరాకీ పెరుగుతూ వస్తోంది.      

  – గాలిపల్లి రవివర్మ, రవివర్మ డిజిటల్‌ స్టూడియో యజమాని 

మరిన్ని వార్తలు